Nani Saripodhaa Sanivaaram:నేచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో రానున్న యాక్షన్ డ్రామా మూవీ 'సరిపోదా శనివారం'. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటించింది. ప్రధాన పాత్రలో ఎస్ జె సూర్య నటించారు. వికేక్ ఆత్రేయ- నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఆగస్టు 29న ఈ మూవీని తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ప్రస్తుతం తమిళ్ ప్రమోషన్స్‌లో సినిమా బృందం బిజీగా ఉంది. ఈ సందర్భంలో నాని హీరో పాత్ర ఎలా ఉండబోతోందోనని వివరించారు. 'కోపం తరచుగా పశ్చాత్తాపానికి దారి తీస్తుంది. కొన్నిసార్లు, ప్రజలు చిన్న చిన్న విషయాలు, పనికి రాని అంశాలపై కూడా కోపం తెచ్చుకుంటారు. కొంచెం ఓపికగా ఉండటం ద్వారా మన కోపం సరైనదేనా? కాదా? అనేది అంచనా వేయవచ్చు. తన కోపాన్ని అంచనా వేయడానికి శనివారం వరకు వేచి ఉండే సూర్య పాత్రను నేను పోషిస్తున్నాను. అతడు కారణం లేని కోపాన్ని, అనర్థాలను నివారించడానికి శనివారం వరకు వేచి ఉంటాడు' అని తెలిపారు.
సూర్య పాత్ర గురించి కూడా నాని మాట్లాడారు. 'సూర్య తనను ఇరిటేట్ చేసిన వారి పేర్లను వారం మొత్తం నోట్ చేస్తాడు. ముఖ్యమైనవి కాదని భావించే పేర్లను లిస్టులో నుంచి తీసేస్తాడు. ఒక వేళ ఎవరి మీదనైనా కోపం వారమంతా ఉంటే అప్పుడు అర్థవంతమైన కోపంగా భావిస్తాడు. ఆ కోపానికి కారణమైన వ్యక్తిని కొట్టడానికి సిద్ధపడిపోతాడు. సాధారణంగా కోపం మంచిది కాదని ప్రజలు చెబుతారు. కానీ సరైన ప్రయోజనం కోసం వచ్చే కోపం శక్తిమంతమైన ఆయుధం వంటిది' అని వివరించాడు.