Chiranjeevi Speech At APTA :అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఆదివారం నిర్వహించిన 'క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్- 2025'కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఫొటోలు పట్టుకుని అవకాశాల కోసం ఏ సినిమా ఆఫీస్ చుట్టూ తిరగలేదని చిరంజీవి అన్నారు.
నటనా శిక్షణ పూర్తికాకముందే ఆయనకు ఛాన్స్‌లు వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఇదే వేదికపై ఆయన పలు విషయాలు షేర్ చేసుకున్నారు. గతంలో మెగాస్టార్ కుటుంబాన్ని సౌత్ఇండస్ట్రీ 'కపూర్ ఫ్యామిలీ' అంటూ ఓ వార్తా పత్రిక ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
సౌత్ఇండియన్ రాజ్ కపూర్
'ఇప్పటిదాకా మీ అందరికీ నా విజయాల గురించి చాలా చెప్పాను. నా అచీవ్మెంట్ పవన్ కల్యాణ్ , నా అచీవ్మెంట్ రామ్‌చరణ్, మా కుటుంబంలో అందరూ నా అచీవ్మెంట్సే. వాళ్లను చూస్తుంటే 'ఇది కదా నేను సాధించింది' అనిపిస్తుంది. మొన్న పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. 'అన్నయ్య నువ్వు ఓ మాట అనేవాడివి గుర్తుందా? మన ఇంట్లో ఇంతమంది ఉన్నందుకు, ఇది నాతో ఆగిపోకూడదు. ఓ రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో, అలాగే మరో రాజ్ కపూర్ ఫ్యామిలీగా మన మెగా కుటుంబం కావాలి అని నువ్వు చెప్పావు. ఈరోజు నీ మాట మంత్రంగా పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నాం. అది నీ మాట పవర్' అని కల్యాణ్ బాబు గుర్తు చేశాడు'