AR Rahman Mohini Dey Divorce : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహమాన్ - సైరా బాను దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన కాసేపటికే, రెహమాన్ టీమ్‌లోని 29 ఏళ్ల మోహినిదే అనే సభ్యురాలు కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలపడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రచారం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో చాలా మంది ఈ విషయమై నెగటివ్‌గా మాట్లాడటం ప్రారంభించారు. అయితే రీసెంట్‌గానే ఈ విషయంపై స్పందించి, రూమర్స్‌ను ఖండించిన మోహినిదే మరోసారి ఈ అంశంపై రియాక్ట్ అయింది. ఏఆర్ రెహమాన్ తనకు తండ్రితో సమానమని చెప్పింది. "ఏఆర్ రెహమాన్ నాకు తండ్రితో సమానం. నాది, రెహమాన్ కుమార్తెలది ఒకే వయసు. ఆయన ఎప్పుడూ నన్ను తన కూతురు లానే చూశారు. 8 ఏళ్ల నుంచి ఆయన బృందంలో పని చేస్తున్నాను. ఆయనంటే నాకు ఎంతో గౌరవం. చాలా చిత్రాలకు ఆయనతో కలిసి సంగీతం అందించాను. ఎన్నో స్టేజ్ షోలు చేశాం. మాపై ఇలాంటి రూమర్స్ రావడం బాధాకరమైన విషయం. ఇలా సున్నితమైన విషయాల్లో సానుభూతి లేకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదు. అలాంటి వారి మానసిక పరిస్థితి చూస్తే బాధతో పాటు జాలి కూడా వేస్తోంది. అసలు ఇలా అసభ్యకరంగా మాట్లాడడాన్ని నేరంగా పరిగణించాలి.
"రెహమాన్ ఒక లెజెండ్. నా కెరీర్‌లో ఆయన ఎంతో కీలకంగా వ్యవహరించారు. నా లైఫ్‌కు ఆయనే రోల్ మోడల్. నాకు సంగీతం నేర్పించిన నా తండ్రిని ఏడాది క్రితమే కోల్పోయాను. అప్పటి నుంచి రెహ్మాన్ టీమ్‌లోని ప్రతి ఒక్కరూ నన్ను సొంత వారిలా ఆదరించారు. మీడియాకు వ్యక్తుల మనసుతో పని ఉండదు. మీడియాలో వచ్చే కామెంట్స్ జీవితాలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో వాళ్లు అస్సలు అర్థం చేసుకోలేరు. దయచేసి ఇలాంటి వాటిని ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టండి. మా గోప్యతను గౌరవించండి" అని ఓ వీడియోను రిలీజ్ చేశారు.