Trump Immigration Policy Changes : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీలను అమలు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రక్షాళన చేయడం ప్రారంభించిన ఆయన, మెక్సికో నుంచి నేరస్థులు దేశంలోకి అడుగుపెట్టకుండా దేశ దక్షిణ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసేలా ఆదేశాలు జారీ చేశారు. మెక్సికో నుంచి అమెరికా వచ్చేందుకు అనుమతులు పొందినవారు సైతం అక్కడే ఆగిపోయేలా చర్యలు తీసుకున్నారు. మెక్సికో సరిహద్దుల వెంబడి గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు.
CBP యాప్ అదృశ్యం
అయితే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై న్యాయపరమైన చిక్కులు తప్పవనే అంచనాలు వెలువడుతున్నాయి. బైడెన్ హయాంలో వినియోగిస్తున్న సీబీపీ యాప్ ద్వారా నమోదై, అమెరికాలో అడుగుపెట్టేందుకు ఇప్పటికే అప్పాయింట్‌మెంట్లు పొందిన వలసదారుల పరిస్థితి ఏంటనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 1450 మంది లాటరీ సిస్టమ్ ద్వారా అప్పాయింట్‌మెంట్లు పొందారు. అయితే ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కాసేపటికే CBP యాప్ అదృశ్యమైంది. కొద్దివారాల క్రితం అప్పాయింట్‌మెంట్లు పొందిన వారివి రద్దయ్యాయి.
గుండెల్లో రైళ్లు!
మరోవైపు మెక్సికో నుంచి వచ్చిన అక్రమ వలసదారులను వెనక్కు తీసుకునేందుకు ఆ దేశం అంగీకరించింది. అమెరికా సరిహద్దుల్లో ఆన్‌లైన్ అప్లికేషన్ ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రకారం వారిని వెనక్కు తీసకుంటామని పేర్కొంది. అమెరికాలో కోటీ 10 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు ట్రంప్ అంచనా వేయగా ఆయన తాజా ఆదేశాలతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నవారి ద్వారా దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని ట్రంప్ చెబుతున్నారు.
మెక్సికన్ తల్లిదండ్రులు ఆందోళన
అలాంటి వారిని వారి దేశాలకు తప్పకుండా పంపిస్తామని, మళ్లీ అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకొని తీరతామని తేల్చిచెప్పారు. అయితే మొదట నేరస్థులను అమెరికా రాకుండా అడ్డుకోవడమే ట్రంప్ ఉద్దేశమని నిపుణులు అంచనా వేస్తున్నారు. తర్వాత దశలో ఇతరులను అరెస్టు చేసేందుకు కూడా వెనుకాడకపోవచ్చని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తమ సంతానం విషయంలో ట్రంప్ ఆదేశాల పట్ల పలువురు మెక్సికన్ తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణం
ఇప్పటికే తన బిడ్డ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ట్రంప్ మొదటి హయాంలో తన భర్తను మెక్సికో పంపారని , ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఓ మెక్సికో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంత మంది తమ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా పేర్లను గుర్తిస్తారనే భయంతో లైసెన్స్ లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు.
గోడ నిర్మాణం
అటు మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించాలని ట్రంప్ ఆదేశించే అవకాశం ఉందని శ్వేతసౌధం అధికారులు తెలిపారు. మెక్సికో సరిహద్దులను మూసివేసేలా వీలైనంత త్వరగా గోడ నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించవచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికాలో అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్న వలసదారుల బృందాలను ఉగ్రవాద సంస్థలుగా ట్రంప్ అభివర్ణిస్తున్నారు. వారిని అమెరికా నుంచి పారదోలాలని డే అరాగ్వా అనే దోపిడీ దొంగల ముఠా వెనుజువెలా నుంచి వచ్చి అమెరికాలో పాతుకుపోయిందని తెలిపారు.
తాత్కాలికంగా బ్రేక్
వివిధ కారణాలతో అమెరికాకు శరణార్ధులుగా వస్తున్నవారికి కూడా అడ్డుకట్ట వేసేందుకు నాలుగు నెలలపాటు వారి రీసెటిల్‌మెంట్‌ను నిలిపివేయాలని ట్రంప్ నిర్ణయించారు. కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమం నడుస్తుండగా దానికి ట్రంప్ తాత్కాలికంగా బ్రేక్ వేయనున్నారు. బైడెన్ హయాంలో సుమారు లక్ష మంది శరణార్థులు అమెరికాలో స్థిరపడ్డారు.