Raajavaaru Raani Gaaru Pair Marriage : తెలుగు చిత్ర పరిశ్రమలో 'రాజా వారు రాణిగారు' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన జంట నిజ జీవితంలో ఒక్కటి కాబోతుంది. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, కథానాయిక రహస్య వివాహం చేసుకోబోతున్నారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు పెద్దల సమక్షంలో ఈ నెల 13న నిశ్చితార్థం చేసుకోనున్నారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ రిసార్ట్స్‌లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా, పెళ్లి, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు.
ఆంధ్ర కుర్రోడు
కడప జిల్లా రాయచోటిలో జన్మించిన కిరణ్ లఘు చిత్రాలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2019లో వచ్చిన 'రాజా వారు రాణిగారు' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై 'ఎస్సార్ కళ్యాణమండపం', 'సమ్మతమే', 'వినరో భాగ్యము విష్ణుకథ', 'మీటర్', 'రూల్స్ రంజన్' చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తన తొలి చిత్రంలో నటించిన కథానాయిక రహస్య జీవిత భాగస్వామిగా దొరకడం పట్ల కిరణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
'అలాంటిది ఏమీ లేదు'
'రాజావారు రాణిగారు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరంకు కథానాయిక పాత్ర పోషించిన రహస్య జీవితతో సినిమా చిత్రీకరణ సమయంలోనే స్నేహం కుదిరింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'దిల్ రుబా', 1970 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. మరోవైపు నటి రహస్య జీవిత రాజావారు రాణి గారు తర్వాత 'షర్బత్' అనే తమిళ చిత్రంలో నటించారు.