kalki 2898 AD Makers Pay Tribute To Ramoji Rao :డైరక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 AD జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బెనిఫిట్ షో నుంచే భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రేమికులు థియేటర్లలో సందడి చేశారు. సోషల్ మీడియాను కల్కి 2898 AD రివ్యూలతో, సినిమాలోని సన్నివేశాలతో షేక్ చేసేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాలోని ప్రతి సీన్ ఊహకందని రేంజ్లో కళ్లకు కట్టినట్టుగా చూపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది.
అయితే ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే కన్నుమూసిన ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజుకు, రీసెంట్గా తుదిశ్వాస విడిచిన బహుముఖ ప్రఙాశాలీ అయిన రామోజీరావుకు నివాళులర్పించింది మూవీటీమ్. థియేటర్లలో టైటిల్స్ పడే సమయంలో ఈ లెజెండ్స్‌కు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నట్లు ప్రకటించింది. వాటి ఫొటోలను తెరపై ప్రదర్శన చేసింది. మీడియా దిగ్గజమైన రామోజీ రావు, సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ అందించారని తెలిపింది.
ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు 87ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. సినిమా రంగానికి, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు ఆయన సేవలు అందించారు. ఆయనలోని క్రియేటివిటీ, ఇన్నోవేషన్ భావితరాల నిర్మాతలకు, ఆర్టిస్టులకు ప్రేరణగా నిలిచేలా జీవించారు. మీడియా రంగంలో కొన్ని వందల మందికి ఉపాధి కల్పించారు. ఇక ఉప్పలపాటి కృష్ణం రాజు కేవలం నటనతోనే కాకుండా తన వారసత్వంగా ప్రభాస్‌ను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఆయన 2022 సెప్టెంబర్ నెలలో 83 ఏళ్ల వయస్సులో ఉండగా కనుమూశారు.