Iman Esmail Biography:సలార్, కల్కి 2898 ఏడీ వరుస విజయాలతో జోరు మీదున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ జోష్‌ను ఇలాగే కంటిన్యూ.. తాజాగా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ శనివారం పూజా కార్యక్రమాలు ముగించుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్షేషన్ ఇమాన్వీ ఎస్మాయిల్ నటిస్తున్నారు. దీంతో ఆమె ఎవరు? నేపథ్యం ఏంటి? అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆమె వివరాలు మీ కోసం..
ఇమాన్వీ ఎస్మాయిల్..ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతున్న యువతకు ఈమె పేరు సుపరిచితమే. తన డ్యాన్స్, స్టైల్‌తో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు, తెలుగు, తమిళ పాటలకూ ఆమె వేసే స్టెప్‌లు నెటిజన్లను ఎంతగానో అలరిస్తాయి. అలాంటి ఇమాన్వీ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ఇమాన్వీ పేరు ట్రెండ్ అవుతోంది. ఇమాన్వీ ఎస్మాయిల్ 1995 అక్టోబర్ 20న దిల్లీలో పుట్టింది. చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఈమెకు ఎంతో ఇష్టం. అందుకే ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది.
ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఎంతో ప్రోత్సహించారు. తన తండ్రి పోత్సాహం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేసి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. దీంతో ఫుల్ టైమ్ డ్యాన్స్, ఈవెంట్స్, డ్యాన్స్ షోలపై దృష్టి పెట్టి నెమ్మదిగా క్రేజ్ సొంతం చేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఆమె చేసే రీల్స్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సుమారు 7 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ప్రభాస్‌తో ఛాన్స్ దక్కించుకోవడంతో మిలియన్ ఫాలోవర్స్ ఇక లాంఛనమే.
టాక్ ఆఫ్ ది టౌన్- హను హీరోయిన్ సెలక్షన్ వేరబ్బా!
అలా డ్యాన్స్‌ను ఒంటబట్టించుకుంది: డ్యాన్స్ అంటే కేవలం శరీర భాగాలు కదపడమే కాదు, ముఖంలో హావభావాలు పలికించడం కూడా తెలియాలని అంటోంది ఇమాన్ (Imanvi Esmail). చిన్నప్పటి నుంచే తన తల్లి కొన్ని మెళకువలు చెప్పారట. బాలీవుడ్ నటులు రేఖ, మాధురీ దీక్షిత్, వైజయంతీ మాల వంటి ఎవర్‌గ్రీన్ హీరోయిన్‌లు నటించిన సినిమాలను చూపిస్తూ ‘వాళ్లు డ్యాన్స్ చేసేటప్పుడు హావభావాలను పరిశీలించు’ అని ఇమాన్వీ వాళ్ల అమ్మ చెప్పేదట. అలా కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా.. అందుకు తగినట్లు హావభావాలు పలికించడం నేర్చుకున్నట్లు ఇమాన్వీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇక ఎప్పటికప్పుడు మ్యూజిక్ యాప్‌లలో కొత్తగా యాడ్ అయ్యే కొత్త పాటలు పదే పదే వినడం ఇమాన్వీకు అలవాటు.
భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్‌లు జోడించి రీక్రియేట్ చేస్తుంది. రీల్స్ చేసేటప్పుడు, ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు కచ్చితంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు, రీల్ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? తగిన కాస్ట్యూమ్స్ ఏంటి? ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతుంది. ఇన్‌స్టాలో తనతో పోటీపడుతున్న ఇషాన్ పటేల్ లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉంటానని అంటోంది. కొందరు ఈమెను జూనియర్ అనుష్క అంటూ అప్పుడే మోసేస్తున్నారు కూడా..
ఈ నేపథ్యంలోనే సినిమా:ఇక ఇమాన్వీ నటిస్తున్న సినిమా విషయానికి వస్తే..భారత స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో 1940ల నాటి పీరియాడికల్ , యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. అందులో స్టోరీ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ఓ కోటలో ఫిరంగుల గర్జనలు, సైనికులు పోరాడుతున్న వేళ.. కోటపై బ్రిటీష్ జాతీయ పతాకం కాలిపోతున్నట్టుగా పోస్టర్ చూపించారు.
ప్రభాస్, హనూ యాక్షన్ ఫిల్మ్ స్టార్ట్ - డార్లింగ్ న్యూ లుక్ అదుర్స్!
విజయ్ 'ది గోట్' ట్రైలర్ ఔట్- మీరు చూశారా?