Hrithik Roshan About Rajinikanth : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన అక్కడ నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా ఈ స్టార్ హీరో చిత్రాలు బీటౌన్‌లోనూ బాగానే ఆడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన నటన, స్టైల్ తమ సినిమాల్లో ఫాలో అయ్యి కాంప్లిమెంట్స్ ఇచ్చే తారలు, రజనీ గురించి అలాగే, ఆయనతో తమకున్న అనుబంధం గురించి చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు కూడా. ఆ సమయంలో ఆయన వ్యక్తిత్వం గురించి కూడా వాళ్లు ఎన్నో గొప్ప ఉదాహరణలు కూడా ఇచ్చారు.
తాజాగా ఓ బీటౌన్ హీరో కూడా రజనీతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడారు. ఆయన చేసిన కొన్ని పనుల వల్ల రజనీకి అభిమానిగా మారిపోయారంటూ చెప్పుకొచ్చారు. ఆయనెవరో కాదు 'వార్'తో పాటు అనేక హిట్ సినిమాల్లో నటించిన స్టార్ హీరో హృతిక్ రోషన్. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో రజనీతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. షూటింగ్ స్పాట్‌లో ఆయనతో గడిపిన క్షణాలను మీడియాతో పంచుకున్నారు. అయితే ఈ ఇద్దరూ కలిసి 1986లో 'భగవాన్ దాదా' అనే సినిమాలో నటించారు. అందులో హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెరిశారు.
"రజనీకాంత్ గురించి చెప్పాలంటే నాకు మాటలు రావు. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు రజనీ నటిస్తోన్న 'భగవాన్ దాదా'లో ఆయనతో కలిసి పనిచేశాను. నేను చిన్నపిల్లాడిని కావడం వల్ల నాతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. సెట్‌లో నేను చేసిన తప్పులను క్షమించేవారు. నేను చెప్తోన్న డైలాగ్‌లో ఏదైనా తప్పు ఉంటే డైరక్టర్ కట్ చెప్పేవారు. కానీ, రజనీ మాత్రం నేను హర్ట్ అవ్వకూడదని, ఆ తప్పు తన మీద వేసుకోవడమే కాకుండా, తానే తప్పు చేసినట్లు నాకు నచ్చజెప్పేవారు. సారీ నాదే తప్పైందని అనేసే వారు. ఇప్పటికీ అది నా మనసులో అలాగే గుర్తుండిపోయింది" అని హృతిక్ అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు.