Hero Vishal Controversy:హీరో విశాల్‌కు అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ స్టార్ హీరోకి తమిళ్ మూవీ ఇండస్ట్రీలో కొత్త కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న సినిమాల షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఎందుకంటే విశాల్ సినిమాలపై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆంక్షలు విధించింది.
2017-2019 వరకు విశాల్ తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఆ సమయంలో అతడిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా 2019లో తమిళనాడు ప్రభుత్వం తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోసం ప్రత్యేక అధికారిని నియమించింది. 2019లో ఈ ప్రత్యేక అధికారి సొసైటీ అకౌంట్స్‌ని ఆడిట్ చేయడానికి ఓ ఆడిటర్‌ను నియమించారు. అకౌంట్‌లను పూర్తిగా పరిశీలించిన తర్వాత స్పెషల్ ఆడిటర్ ఓ నివేదిక సబ్మిట్ చేశారు. అందులో అసోసియేషన్‌లోని నిధుల దుర్వినియోగం జరిగినట్లు స్పష్టం చేశారు.
నిధులు దుర్వినియోగం!
ఆడిటర్ తన నివేదికలో అసోసియేషన్ బ్యాంక్ అకౌంట్‌లోని రూ.7.5 కోట్లు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. అదనంగా 2017- 2019 మధ్య ఆదాయం, ఖర్చు నుంచి రూ.5 కోట్లు, మొత్తం రూ.12 కోట్లు దుర్వినియోగం అయినట్లు పేర్కొన్నారు. ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి అక్రమంగా ఖర్చు చేసిన సొమ్మును తిరిగి కౌన్సిల్‌కు ఇవ్వాలని విశాల్‌కు పలుమార్లు తెలియజేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని సమాచారం.