Raj tarun Tiragabadara Saami Movie Review :గతవారం పురుషోత్తముడు చిత్రంతో ప్రేక్షకులను అలరించిన రాజ్ తరుణ్ ఈ శుక్రవారం తిరగబడరసామీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అసలే ప్రస్తుతం టాలీవుడ్లో రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ కాంట్రవర్సీ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన ఈ చిత్రం ఆయనకు విజయాన్ని అందించిందా?
కథేంటంటే ? - చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమైన గిరి(రాజ్ తరుణ్) అనాథలా పెరుగుతాడు. దీంతో తనలా కుటుంబాలకు దూరమైన వాళ్లను తిరిగి వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించడమే లక్ష్యంగా ముందుకెళ్తుంటాడు. అలా అతను తన సామాజిక కార్యక్రమాల ద్వారా కాస్త పాపులర్ అవుతాడు. ఈ క్రమంలోనే గిరిని చూసిన శైలజ (మాల్వి మల్హోత్రా) అతడితో ప్రేమలో పడుతుంది. పెళ్లి కూడా చేసుకుంటారు. ఇంతలో కొండారెడ్డి (మకరంద్ దేశ్‌పాండే) గ్యాంగ్ శైలజ కోసం వెతుకుతుంటుంది. ఈ క్రమంలోనే తన భార్య శైలజ రూ.2 వేల కోట్ల ఆస్తికి వారసురాలని తెలిసిన గిరి ఏం చేశాడు? అసలు శైలజకీ, కొండారెడ్డికీ ఉన్న సంబంధం ఏమిటి? తన భార్యను కాపాడుకోవడానికి గిరి ఏం చేశాడు? అన్నదే కథ.
ఎలా ఉందంటే ? - మూసధోరణిలో సాగే కథ ఇది. ఊహకు అందే కథ, కథనాలతో సాగుతూ ఆసక్తిని రేకెత్తించదు. ప్రేక్షకుడి మనసును తాకేలా ఎమోషన్స్, కాసేపు కామెడీ అయినా కూడా కనిపించలేదు. కథ మొత్తం సాదాసీదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ సీన్ ఊహించినట్టుగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్స్ పర్వాలేదనిపించినా, ఆ తర్వాత మళ్లీ మామూలే. ఫైనల్‌గా చెప్పాలంటే కాలం చెల్లిన కథ, పాత్రలు, సన్నివేశాలతో తెరకెక్కించారనే చెప్పాలి.