Sajjan Kumar Life Imprisonment : దేశ రాజధాని దిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దిల్లీలోని ఓ కోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. ఆ మారణకాండ సందర్భంగా జరిగిన ఓ హత్య కేసులో ఈనెల (ఫిబ్రవరి) 12వ తేదీనే దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు శిక్షను విధించింది. స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఈమేరకు తీర్పు ఇచ్చారు. అయితే సజ్జన్ కుమార్ వయోభారం, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నందున, ఆయనకు మరణశిక్షకు బదులుగా జీవితఖైదు శిక్షను విధించినట్లు దిల్లీ కోర్టు వెల్లడించింది.
"సజ్జన్ కుమార్ చేసిన నేరాలు నిస్సందేహంగా క్రూరమైనవే. ఖండించదగినవే. అయితే సజ్జన్ వయసు ఇప్పుడు 80 ఏళ్లు. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే మరణశిక్షకు బదులుగా జీవిత ఖైదును విధించాల్సి వచ్చింది" అని కోర్టు ధర్మాసనం తెలిపింది.
దిల్లీలో 1984 నవంబరు 1న జస్వంత్ సింగ్ అనే వ్యక్తితో పాటు, అతడి కుమారుడు తరుణ్ దీప్‌సింగ్ హత్య జరిగింది. ఇందులో సజ్జన్ కుమార్ ప్రమేయం ఉందని విచారణలో తేలింది. ప్రస్తుతం దిల్లీలోని తిహాడ్ జైలులో ఆయన ఉన్నారు. ఈనెల 12న సజ్జన్‌ను దోషిగా నిర్ధరించిన వెంటనే తిహాడ్ జైలుకు దిల్లీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సజ్జన్ మానసిక స్థితిగతుల వివరాలతో తమకు నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. ఏదైనా కేసులో దోషులకు గరిష్ఠ స్థాయి కఠిన శిక్షను విధించే ముందు, వారి మానసిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టులకు గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. వాటిని పాటించే క్రమంలోనే సజ్జన్ కుమార్ మానసిక ఆరోగ్యంపై తిహాడ్ జైలు నుంచి నివేదికను దిల్లీ కోర్టు తెప్పించుకుంది. సజ్జన్ కుమార్ వల్ల హత్యకు గురైన జస్వంత్ భార్య తరఫు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. సజ్జన్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హత్య కేసుల్లో దోషులుగా తేలే వారికి గరిష్ఠంగా మరణశిక్ష, కనిష్ఠంగా జీవితఖైదు శిక్షను విధిస్తుంటారు.
కేసు విచారణ సాగిందిలా!
జస్వంత్, అతడి కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్య వ్యవహారంలో తొలుత దిల్లీలోని పంజాబీ బాఘ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరిగా దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణను చేపట్టింది. 1984 నవంబరు 1న జరిగిన ఈ హత్య కేసులో ప్రాథమిక ఆధారాలు లభించడం వల్ల ఎట్టకేలకు 2021 డిసెంబరు 16న సజ్జన్ కుమార్‌పై కోర్టులో అభియోగాలను నమోదు చేశారు. "1984 నవంబరు 1న జస్వంత్ ఇంటిపై పెద్దసంఖ్యలో అల్లరిమూకలు దాడి చేశారు. ఆ గుంపునకు సజ్జన్ కుమార్ సారథ్యం వహించారు. జస్వంత్ ఇంట్లోని వారిపై దాడి చేసేలా అల్లరి మూకలను సజ్జన్ రెచ్చగొట్టారు" అని అభియోగాల్లో ప్రస్తావించారు. ఈ ఘటనలో జస్వంత్ ఇంటిని అల్లరి మూకలు లూటీ చేసి నిప్పుపెట్టారు. ఈ విషయంలో ఇప్పటి వరకు జస్వంత్ భార్య ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘ న్యాయపోరాటాన్ని కొనసాగించారు.
నానావతి కమిషన్ రిపోర్టులో కీలక అంశాలు
దిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు, తదనంతర పరిణామాలపై విచారణ కోసం నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అది ఒక నివేదికను రూపొందించింది. దాని ప్రకారం, సిక్కు వ్యతిరేక అల్లర్లలో 2,733 మంది చనిపోయారు. ఈ మారణహోమం జరిగిన తర్వాత దిల్లీలోని ఎంతో మంది బాధితుల ఫిర్యాదు మేరకు 587 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. వీటిలో సరైన సమాచారం లేదంటూ 240 ఎఫ్‌ఐఆర్‌లను మూసేశారు. 250 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. కేవలం 28 కేసుల్లోని 400 మంది నిందితులకు మాత్రమే శిక్షలు పడ్డాయి.
సజ్జన్ కుమార్ సహా దాదాపు 50 మంది మాత్రమే హత్య కేసుల్లో దోషులుగా తేలారు. అప్పట్లో దిల్లీ కాంగ్రెస్ పార్టీలో ప్రభావవంతమైన నేతగా సజ్జన్ వ్యవహరించేవారు. దిల్లీలోని పాలం కాలనీలో 1984 నవంబరు 1, 2 తేదీల్లో జరిగిన ఐదుగురి హత్యల వ్యవహారంలో నిందితుడిగా సజ్జన్ కుమార్ ఉన్నారు. ఆ కేసులో దిల్లీ హైకోర్టు కూడా గతంలో ఆయనకు జీవిత ఖైదు శిక్షను విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడది దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. దిల్లీ హైకోర్టులోనూ ఆయన మరో అప్పీల్ పిటిషన్ వేశారు.