How to Make Papad with Left Over Rice: రాత్రి వండిన అన్నం మిగిలిపోవడం ప్రతీ ఇంట్లో జరిగేదే. ఇక అదే అన్నాన్ని పొద్దున తినమంటే అందరూ ముఖం చిట్లిస్తారు. ఇక తప్పక కొద్దిమంది మరుసటి రోజు తాలింపు వేసుకుని తింటుంటారు. అలాగే కొందరు అట్లు, వడలు, పకోడీలు అంటూ కొత్తగా ట్రై చేస్తుంటారు. ఇవన్నీ ఎప్పుడో ఒకసారి చేసేవే. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి మిగిలిపోయిన అన్నంతో అప్పడాలు తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాగో ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి, వీటిని ఒక్కసారి రెడీ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటాయి. పైగా ఎప్పుడుకావాలంటే అప్పుడు నూనెలో వేయించుకుని తింటే సరి. సైడ్ డిష్‌గా, స్నాక్స్‌గా పర్ఫెక్ట్. మరి లేట్ చేయకుండూ మిగిలిన అన్నంతో అప్పడాలు ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- మిగిలిన అన్నం - 1 కప్పు
- నీళ్లు - 2 కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - 1 టీ స్పూన్
- వాము - 1 టీ స్పూన్
- రెడ్ చిల్లీ ఫ్లేక్స్ - 1 టీ స్పూన్
తయారీ విధానం:
- ప్రెషర్ కుక్కర్లో అన్నం వేసుకోవాలి. ఆ తర్వాత అన్నానికి సరిపడా రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ అన్నం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో నీళ్లు తీసుకోవాలి.
- అలాగే ఇక్కడ కొద్దిమొత్తంలోనే అప్పడాలు ఎలా చేసుకోవాలో చెబుతున్నాం. అదే మీరు ఎక్కువ మొత్తంలో చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు రాత్రి మిగిలిన అన్నాన్ని ఓ బాక్స్‌లో పెట్టుకుని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఓ నాలుగు రోజుల పాటు స్టోర్ చేసుకుని ఆ అన్నంతో అప్పడాలు పెట్టుకోండి.
- ప్రెషర్ కుక్కర్లో అన్నం, నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టాలి. ఇప్పుడు ఈ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
- కుక్కర్ విజిల్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చల్లార్చుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత కొద్దికొద్దిగా మిక్సీజార్‌లోకి ఉడికించిన నీళ్లతో సహా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నం మొత్తం రుబ్బుకోవాలి.
- ఈ మిశ్రమంలోకి రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, వాము, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
- ఇప్పుడు వైట్ కాటన్ క్లాత్ తీసుకుని తడిపి నీళ్లు లేకుండా శుభ్రంగా పిండుకోవాలి.
- ఇప్పుడు మేడ లేదా బాల్కనీలో ఎండ తగిలే ప్రదేశంలో చాప లేదా పట్టా వేసి దాని మీద తడిపిన కాటన్ క్లాత్ వేసుకోవాలి.
- అన్నం మిశ్రమాన్ని చిన్న గరిటెతో సాయంతో కొంచెం క్లాత్ మీద పరిచి అప్పడాల సైజ్‌లో స్ర్పెడ్ చేసుకోవాలి. అన్నం మిశ్రమాన్ని మొత్తం అప్పడాలుగా పెట్టుకోవాలి.
- ఇలా పెట్టుకున్న అప్పడాలను సుమారు రెండు రోజుల పాటు రోజంతా ఎండలో ఉంచాలి. సాయంత్రం ఎండ తగ్గుతున్నప్పుడు తీసి ఇంట్లో పెట్టి మరునాడు ఎండ వచ్చినప్పుడు ఆరబెట్టాలి.
- ఇవి బాగా ఎండిన తర్వాత కాటన్ క్లాత్ వెనుకవైపు కొంచెం తడి చేసుకుంటూ వీటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇలా అన్ని వడియాలను క్లాత్ నుంచి తీసిన తర్వాత మరో రోజు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటాయి.
- బాగా ఎండిన అప్పడాలను బాగా కాగిన నూనెలో వేసి వేయించుకుంటే సరి. సూపర్ టేస్టీగా ఉండే అన్నం అప్పడాలు రెడీ.
బొంబాయి రవ్వతో "వడియాలు" - చాలా ఈజీ, సూపర్ టేస్టీ! - ఏడాదిపాటు నిల్వ!
రెండు సంవత్సరాలైనా పాడవని ఊర మిరపకాయలు - ఒక్కరోజులోనే ఈ స్పైసీ సైడ్ డిష్ రెడీ!