Prathidhwani Debate On Online Cricket Betting : బెట్టింగ్ బంగార్రాజులు బీకేర్‌ఫుల్! ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు హానికరం! ఆర్థికంగా నష్టాలే కాదు అవి ప్రాణాంతకం కూడా. ఎంతో కాలంగా ఈ మాట చెబుతున్నా పెడ చెవిన పెడుతున్న వారికి డబ్బుల కోసం బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న వారికి హెచ్చరికలాంటి పరిణామం ఇది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రచారం : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రచారం చేస్తున్న నాని అలియాస్ లోకల్‌బాయ్ నానిని విశాఖ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అసలు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసేవారిపై చట్టాలు కేంద్ర ప్రభుత్వం, 2022లో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఆ యాప్‌ల ఊబిలో చిక్కి జీవితాలే నష్టపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న దీనగాథల నేపథ్యంలో ఇంకా ఎలాంటి చర్యలు అవసరం? నేటి ప్రతిధ్వని.
లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన పోలీసులు : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్న వాసుపల్లి నాని అలియాస్ యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ కంచర వీధికి చెందిన నాని ఇటీవల బెట్టింగ్ యాప్‌లపై ప్రచారం చేస్తూ ఒక వీడియోను రూపొందించారు. ఇలాంటి ప్రచారంతో యువతను తప్పుదోవ పట్టిస్తున్న నానిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 21న టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సహా కొంతమంది సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు.
అతడికి బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల నుంచి కొంత డబ్బు ముట్టినట్లుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. దీంతో శనివారం నానిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొంత మంది యూట్యూబర్‌లు కూడా బెట్టింగ్ యాప్‌లపై ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.