Fighter OTT : బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. దీంతో జనవరి 25న థియేటర్లలో రిలీజైన ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల అలరించేందుకు వచ్చేసింది. మార్చి 20 రాత్రి 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వడం ప్రారంభం చేసుకుంది. దీంతో యాక్షన్ ప్రియులు ఆనందిస్తున్నారు. అయితే ఈ చిత్రం కేవలం హిందీ వెర్షన్లోనే అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. తెలుగులో లేదని తెలుస్తోంది. ఇకపోతే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీవ్ జైశ్వాల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఫైటర్ సినిమా కథేంటంటే :భారత వైమానిక దళంలో సంషేర్ పఠానియా అలియాస్ పాటీ (హీరో హృతిక్ రోషన్) స్క్వాడ్రన్ లీడర్‌గా పని చేస్తుంటాడు. సాహసాలకు అస్సలు వెనకాడడు. తనకు పై అధికారులు అప్పజెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తాడు. అవసరమైతే తనకున్న పరిధుల్ని, నిబంధనల్ని దాటి సాహసాలు చేస్తూ బాధ్యతల్ని నిర్వర్తిస్తాడు. అయితే అలా ఓ సారి జరిగిన ఓ దుస్సంఘటనకు బాధ్యుడు అవుతాడు. తాను చేయని తప్పునకు నిందని మోస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత ఓ ఆపరేషన్ కోసం మళ్లీ శ్రీనగర్‌కు వస్తాడు. అక్కడ సీవో రాకీ (అనిల్ కపూర్) ఆధ్వర్యంలో తాజ్ (కరణ్ సింగ్ గ్రోవర్), మిన్ను అలియాస్ మినల్ సింగ్ రాఠోడ్ (దీపికా పదుకొణె), బాష్ (అక్షయ్ ఒబెరాయ్) టీమ్ రంగంలోకి దిగుతుంది. మరి గగనతలంలో శత్రువులపై ఈ టీమ్ పోరాటం ఎలా సాగింది? పాటీ ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడా? మళ్లీ నిబంధనల్ని ఏమైనా అతిక్రమించాడా? అసలు రెండేళ్ల కిందట జరిగిన ఆ సంఘటన ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా తప్పక చూడాల్సిందే.