Fathers Day Special 2024:తెలుగు సినిమా, ప్రపంచానికి చాలా మంది గొప్ప నటులను పరిచయం చేసింది. ఎంతలా అంటే, కొన్ని పాత్రల పేర్లు చెబితే, కొందరు నటులు మనసులో మెదులుతారు. గయ్యాలి అత్త పాత్రకు సూర్యకాంతం, తల్లి పాత్రలకు నిర్మలమ్మ మారుపేరుగా మారిపోయారు. అలానే చాలా మంది యాక్టర్లు తండ్రి పాత్రల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆదివారం (జూన్ 16) 'ఫాదర్స్ డే' సందర్భంగా వెండి తెరపై తండ్రి పాత్రలకు వన్నె తీసుకొచ్చిన యాక్టర్లను గుర్తు చేసుకుందాం.
గుమ్మడి వెంకటేశ్వరరావు:1950లలో హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, అనంతరం విలన్‌గా మారారు. క్రమంగా హీరోకి, వాళ్ల పెద్దన్నకి ఫ్రెండ్ రోల్స్ చేశాడు. ఏఎన్నార్, ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోలకు సమానంగా ప్రధాన పాత్ర లేదా ప్రతినాయకుడి పాత్రలు పోషించారు. 1970ల చివరలో తండ్రి పాత్రలు చేశారు. కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, అలానే కొన్ని మూవీల్లో విలన్స్‌కి కూడా ఫాదర్‌గా యాక్ట్ చేశారు. భార్య భర్తలు, సంపూర్ణ రామాయణం, ఇద్దరు మిత్రులు, మరో మలుపు, పునర్జన్మ, అంతస్తులు, ఆస్తిపరులు, బృందావనం లాంటి సినిమాల్లో ఆయన చేసిన తండ్రిపాత్రలకు గుర్తింపు వచ్చింది.
ఎస్వీ రంగారావు:ఎస్వీ రంగారావు 1950లలో ఏఎన్నార్, ఎన్టీఆర్ తండ్రి పాత్రలు పోషించారు. పెళ్లి చేసి చూడులో ఎన్టీఆర్‌కు తండ్రిగా, ఏఎన్నార్ సినిమాల్లో హీరోయిన్ తండ్రిగా కనిపించారు. అటు పౌరాణికాలు, ఇటు జానపదాలు, సాంఘిక చిత్రాల్లో చాలా కీలక పాత్రలు పోషించి, ఉత్తమ నటులనే గుర్తింపు పొందారు. పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు, లక్ష్మీ నివాసం, తాత- మనవడు, ఆత్మ బంధువు, దసరాబుల్లోడు మూవీల్లో ఆయన చేసిన తండ్రి పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
చిత్తూరు వి.నాగయ్య:తెలుగు సినిమాల్లో మొదటి స్టార్ యాక్టర్‌గా చిత్తూరు వి.నాగయ్యను పేర్కొంటారు. ఆయన ఆరోజుల్లోనే లీడ్ రోల్‌కి రూ.లక్షకు పైగా వసూలు చేశారని చెబుతారు. కొంతకాలానికి తండ్రి పాత్రలు లేదా చిన్న పాత్రలు కూడా పోషించారు. పాండురంగ మహత్యం, శ్రీ సీతారామ కళ్యాణం, వాగ్దానం, మూగ నోము సినిమాల్లో తండ్రి పాత్రల్లో మెప్పించారు.
కైకాల సత్యనారాయణ:కైకాల సత్యనారాయణ చాలా కాలం విలన్‌గా యాక్ట్ చేశారు. తర్వాత మెల్లగా పెద్ద స్టార్స్ సినిమాల్లో పాజిటివ్ రోల్స్‌లో కనిపించారు. నెగెటివ్ లీడ్, పాజిటివ్ ఫాదర్‌గా కూడా క్లిక్ అయ్యాడు. శ్రీ రంగ నీతులు, అమ్మ రాజీనామా, శుభలేఖ, మంత్రి గారి వియ్యంకుడు, మజ్ను, ఆఖరి పోరాటం, పెళ్లి సందడి సినిమాల్లో ఆయన చేసిన తండ్రి పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.
చంద్ర మోహన్:చంద్ర మోహన్ 1990ల ప్రారంభం నుంచి హాస్యనటుడు. కామెడీ హీరో పాత్రల నుంచి క్యారెక్టర్ రోల్స్‌కి మారారు. ఏ పాత్రైనా ఈజీగా చేయగలరనే గుర్తింపు పొందారు. ఆయన ఫాదర్‌గా నవ్వించారు, కొన్ని సినిమాల్లో ఏడిపించారు. ముఖ్యంగా ఆమె, ఒక్కడు, నువ్వే నువ్వే, ఢీ, మనసంతా నువ్వే, 7జీ బృందావన కాలనీ, గులాబీ సినిమాల్లో ఫాదర్ రోల్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి.
సుత్తి వీరభద్రరావు:సుత్తి వీరభద్రరావు ఎక్కువగా కామెడీ షేడ్స్ ఉన్న తండ్రి పాత్రలు చేశారు. ప్రధానంగా జంధ్యాల సినిమాల్లో కామెడీ హీరోల తండ్రిగా యాక్ట్ చేసి మెప్పించారు. చూపులు కలసిన శుభవేళ, శ్రీవారికి ప్రేమ లేఖ, నాలుగు స్తంభాల ఆట, మొగుడు పెళ్లాలు వంటి చిత్రాల్లో ఆయనకు మంచి మార్కులు పడ్డాయి.