Diwali Release Movies Kiran Abbavaram KA Movie Review :దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ ముందుకు వచ్చిన చిత్రాల్లో కిరణ్ అబ్బవరం నటించిన 'క' కూడా ఒకటి. అయితే ఈ చిత్రం గురించి కిరణ్ అబ్బవరం చెప్పిన మాటలు, విసిరిన సవాళ్లు సినిమాపై కాస్త ఆసక్తిని పెంచాయి. మరి ఇంతకీ ఈ 'క' చిత్రం ఎలా ఉందంటే? సినిమాలో ఉన్న కొత్తదనమేంటి? తెలుసుకుందాం.
కథేంటంటే(KA Movie story) - అనాథ అయిన అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవనం కొనసాగిస్తుంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ, వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ, ఆ రాతల్లో తాను పోగొట్టుకున్న బంధాల్ని వెతుక్కుంటాడు. అయితే ఓసారి తన ఉత్తరం దొంగతనంగా చదివాడని మాస్టార్ గురునాథం (బలగం జయరాం) కొట్టడం వల్ల, ఆశ్రమం నుంచి పారిపోతాడు వాసుదేవ్.
ఆ తర్వాత కొంతకాలానికి కృష్ణగిరికి వచ్చిన వాసు అక్కడ కాంట్రాక్ట్ పోస్ట్ మెన్‌గా ఉద్యోగంలో చేరుతాడు. ఈ క్రమంలోనే పోస్ట్‌మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో ప్రేమలో పడతాడు. మరోవైపు అదే ఊళ్లో అమ్మాయిలు ఒక్కొక్కరుగా మిస్ అయి పోతుంటారు. అదే సమయంలో ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకు ఓ లెటర్ వల్ల ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన క్లూ దొరకడం, అక్కడి నుంచి వాసుదేవ్ జీవితంలో సమస్యలు ఎదురుకావడం జరుగుతాయి. మరి ఊరి అమ్మాయిలను ఎలా మాయమైపోతున్నారు? దానికి కారణం ఎవరు? అసలు సినిమాలో ఉన్న ముసుగు వ్యక్తి ఎవరు? వాసుదేవ్ - సత్యభామల ప్రేమకథ ఫలించిందా? అనేదే కథ.
ఎలా సాగిందంటే? - 'క' కొత్త కాన్సెప్ట్ కథ అనే చెప్పాలి. సినిమాలోని ప్రతి అంతశం వేటికవే ఆకట్టుకుంటాయి. సినిమా అంతా ఒకెత్తైతే, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ మరొకెత్తు. ఈ రెండూ ప్రేక్షకుల బుర్ర తిరిగిపోయేలా చేస్తాయి. ఓ కొత్త అనుభూతిని అందిస్తాయి.
ముఖ్యంగా మనిషి పుట్టుక, కర్మ ఫలం, రుణానుబంధం - ఈ మూడు అంశాల్ని ముడిపెట్టిన దర్శకుడు, చివరికి చెప్పిన సందేశం, కథను ముగించిన తీరు చాలా బాగుంది. సినిమాలో మధ్యలో వచ్చే కోర్టు యాక్షన్ సీక్వెన్స్, జాతర పాట, క్లైమాక్స్ ఫైట్ మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. చివరి 15నిమిషాలు కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. భావోద్వేగాలతో మదిని బరువెక్కిస్తుంది.