Director Joshiy House Theft :మలయాళ చిత్ర దర్శకుడు జోషి నివాసంలో రూ.కోటీ రూపాలయకుపైగా విలువైన ఆభరణాలను చోరీ చేసిన కేసులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చోరీకి పాల్పడిన ఇర్ఫాన్ బిహార్‌లోని జిల్లాలోని గ్రామ సర్పంచ్ భర్త అని పోలీసులు వెల్లడించారు. కర్ణాటక పోలీసుల సాయంతో ఉడిపి జిల్లాలో దాక్కున్న నిందితుడిని అరెస్ట్ చేసి కొచ్చికి తీసుకొచ్చినట్లు కొచ్చి నగర పోలీసు కమిషనర్ శ్యామ్ సుందర్ తెలిపారు. సీసీ టీవీ దృశ్యాలు పరిశీలించి నిందితుడైన ఇర్ఫాన్ వాహనాన్ని గుర్తించినట్లు తెలిపిన కొచ్చి కమిషనర్ కారు నెంబర్‌తో దాన్ని ట్రాక్ చేశామని వెల్లడించారు.
ఆ కారుకు బిహార్ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ అనే బోర్డు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఆ దిశగా దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలిపారు. కారు ఉడిపి జిల్లాలో ఉన్నట్లు గుర్తించి కర్ణాటక పోలీసుల సాయంతో ఇర్ఫాన్‌ను అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితుడు ఇర్ఫాన్ డబ్బులు, నగలు దొంగిలించి ప్రజలకు పంచుతున్నాడన్నది నిజమేనా అని ఓ విలేకరి ప్రశ్నించగా, తమ దృష్టిలో ఇర్ఫాన్ ఓ నిందితుడంటూ పోలీసులు తెలిపారు. ఇక మహమ్మద్ ఇర్ఫాన్‌పై ఆరు రాష్ట్రాల్లో 19 కేసులు ఉన్నాయని శిక్ష అనుభవించి గత నెలలోనే జైలు నుంచి బయటకు వచ్చాడని కమిషనర్ తెలిపారు. రూ. కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
"సీసీటీవీ విజువల్స్‌ను పరిశీలిస్తున్నప్పుడు, అనుమానాస్పద హోండా అకార్డ్ కారును గుర్తించి, దాని దారిని అనుసరించాం. కారు కాసర్‌గోడ్ దాటిందని గుర్తించాం. నిందితులను పట్టుకోవడంలో కర్ణాటక అధికారులను తమకు సహాయం చేయమని కోరాం. వారి సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేశాం. నిందితుడు ఏప్రిల్ 20న కొచ్చికి వచ్చాడు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నగరంలో విలాసవంతంగా ఉండే ప్రాంతాలు ఏవో గూగుల్‌లో శోధించాడు. చోరీ జరిగిన రోజు రాత్రి స్థానికంగా ఉన్న మరో మూడు ఇళ్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు." అని కొచ్చి కమిషన్ శ్యామ్ సుందర్ తెలిపారు.