Chiranjeevi Varuntej Operation Valentine : మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ తన తొలి సినిమా ముకుందాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కంచె సినిమాతో సక్సెస్‌ను ఖాతాలో వేసుకుని విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. అనంతరం ఫిదాతో కమర్షియల్ హిట్‌ను అందుకుని స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తొలిప్రేమ, ఎఫ్ 2, ఎఫ్ 3తో చిత్రాలతో మెప్పించిన ఆయన ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి అతిథిగా విచ్చేసి ఆసక్తికర విషయాలను చెప్పారు. అదే సమయంలో యాంకర్ సుమ చిరుకు కొన్ని సరదా ప్రశ్నలు కూడా వేసింది. ఇందులో భాగంగా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రేమ విషయాన్ని ప్రస్తావించింది. చిరు లీక్స్ అంటే మాకు చాలా ఇష్టం. మరి మాకు వరుణ్ లవ్ లీక్ ఇవ్వలేదు. ఆ లీక్ మీకు రాలేదా? అన్ని సరదాగా అడిగింది.
అప్పుడు చిరు మొదటి సారి వరుణ్ లవ్ స్టోరీపై స్పందించారు. "సాధారణంగా వరుణ్ తేజ్ నాతో అన్ని విషయాలను పంచుకుంటాడు. వాళ్ల నాన్నకు చెప్పలేనివి కూడా నాతో చెప్తాడు. నేనే ఇన్స్పిరేషన్ అంటుంటాడు. కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం నా దగ్గర దాచాడు. అదే నాకు కోపంగా ఉంటుంది" అంటూ మెగాస్టార్ సరదాగా బదులిచ్చారు. దీనికి వరుణ్ తేజ్ స్పందిస్తూ అది భయంతో కూడిన గౌరవమని, అయినా తన ప్రేమ విషయాన్ని ముందుగా పెదనాన్నతోనే చెప్పినట్టు వివరించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.