Bigg Boss 8 Telugu Winner :బిగ్‌బాస్ తెలుగు సీజన్- 8లో నిఖిల్ విజేతగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరైన గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, నిఖిల్‌ను విజేతగా ప్రకటించారు. విజేతగా నిలిచిన కంటెస్టెంట్‌కు రూ. 55 లక్షలు ప్రైజ్ మనీ దక్కింది. అలాగే మారుతి కార్ కూడా దక్కించుకున్నారు. ఇక గౌతమ్ రన్నరప్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో నిఖిల్ గురించి ఆసక్తికర విషయాలు.
డ్యాన్స్ అంటే ప్రాణం
నిఖిల్ కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించారు. పూర్తి పేరు నిఖిల్ మాలియక్కల్. తల్లి సులేఖ కన్నడ నటి. తండ్రి శశి జర్నలిస్ట్. చిన్నప్పటి నుంచి సినిమాల గురించి చర్చ, ఆసక్తి ఉండటంతో నిఖిల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో అడుగుపెట్టారు. స్కూల్‌కు వెళ్లే రోజుల్లోనే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ముఖ్యంగా డ్యాన్స్ పోటీల్లో ఉండేవారు. ఆచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు.
డ్యాన్సర్ అవుదామని
వినోదరంగంలోకి వచ్చే ముందు ఓ ప్రైవేటు కంపెనీలో బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా కొన్నాళ్లు పనిచేశారు నిఖిల్. నటనపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి, పూర్తిగా అవకాశాల వేట మొదలు పెట్టారు. డ్యాన్స్‌పై తనకున్న పట్టుతో ఇండస్ట్రీలో డ్యాన్సర్ అవుదామని అనుకున్నారు. ఈ క్రమంలో పలు ఈవెంట్లను కూడా చేశారు. ఆ తర్వాత 2016లో 'ఊటీ' చిత్రంతో నటుడిగా కన్నడ వెండితెరకు పరిచయం అయ్యారు. అందులో సహాయ నటుడిగా కీలక పాత్ర పోషించారు.
తెలుగు సీరియల్స్‌తో
చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్న నిఖిల్ కెరీర్‌ను 'మానై మంత్రాలయ' మలుపు తిప్పింది. ఇందులోని నటనకు గానూ కన్నడ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక స్టార్ మాలో ప్రసారమైన 'గోరింటాకు', 'అమ్మకు తెలియని కోయిలమ్మ' సీరియల్స్‌తో నిఖిల్‌ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. వీటితో పాటు, 'కిర్రాక్ బాయ్స్.. ఖిలాడీ గర్ల్స్' అనే రియాల్టీ షో కూడా నిఖిల్‌కు పేరు తెచ్చింది.
బిగ్‌బాస్‌లో మొదటి నుంచి గట్టి పోటీ
బిగ్‌బాస్ సీజన్-8లో అడుగు పెట్టిన నిఖిల్‌పై మొదట్లో ఎలాంటి అంచనాలు లేవు. ఫిజికల్ టాస్క్‌ల్లో గట్టి పోటీ ఇస్తూ, నామినేషన్స్‌లో సరైన పాయింట్లు చెబుతూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటూ వచ్చారు. నామినేషన్స్ సమయంలో మిగితా ఇంటి సభ్యులు ఎన్ని రకాలుగా నిఖిల్‌పై ఆరోపణలు చేసినా, వాటికి సరైన సమాధానం ఇస్తూ ముందుకు సాగారు. టాస్క్‌ల సమయంలో పృథ్వీతో కలిసి ఆడుతూ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ కూడా గ్రూప్ గేమ్, సేఫ్ గేమ్ అంటూ నిఖిల్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇక ఫిజికల్ టాస్క్‌ల్లో గాయాలైనా లెక్కచేయకుండా ఆడారు. హౌస్‌మేట్స్ ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూ సహనం కోల్పోకుండా నిఖిల్ ఆడిన స్మార్ట్ గేమ్ అతడిని విజయం పథంవైపు నడిపింది. అంతేకాదు, ఇప్పటివరకూ బిగ్‌బాస్ సీజన్‌లలో ఏ కంటెస్టెంట్ అందుకోని భారీ ప్రైజ్ మనీ రూ.54లక్షలు నిఖిల్ అందుకున్నారు.