Bigg Boss 8 Telugu Family Week: బిగ్‌బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుని.. 11వ వారానికి సంబంధించిన నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. సాధారణంగా బిగ్‌బాస్‌లో 10 వారాల తర్వాత ఫ్యామిలీ వీక్ ఉంటుంది. హౌజ్‌లో అన్ని రోజులు కొట్టుకున్న వాళ్లు కూడా ఫ్యామిలీ వీక్ టైమ్‌లో కలిసిపోతుంటారు. తాజాగా సీజన్8లో కూడా ఫ్యామిలీ వీక్ సందడి మొదలైపోయింది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ ఫ్యామిలీ వీక్‌లో భాగంగా మొదటిగా నబీల్ అఫ్రిది తల్లి, రోహిణి అమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి మరి.
మొదటిగా నబీల్‌ని కన్ఫెషన్ రూంకి పిలిచి.. స్వీట్ తినకూడదనే శిక్షను ఎత్తేశారు బిగ్‌బాస్. నబీల్ ముందు స్వీట్స్ ఉంచి.. తినమన్నారు. దీంతో ఆ హల్వా మొత్తం లాగించేశాడు నబీల్. ఆ తరువాత యాక్షన్ రూమ్‌కు పిలిచి మరికొన్ని స్వీట్స్ ఇచ్చి తినమన్నారు బిగ్ బాస్. "ఏంటి బిగ్ బాస్ ఈరోజు స్వీట్స్ తినిపించీ.. తినిపించీ చంపేస్తారా నన్ను" అంటూనే.. వాటిని లాగించేశాడు నబీల్. ఇంతలో నబీల్ తల్లి.. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికీ నబీల్ యాక్షన్ రూమ్‌లో ఉన్నాడు. అతన్ని లోపలే ఉంచి బయట లాక్ చేశాడు బిగ్ బాస్. యాక్షన్ రూం నుంచి హౌస్‌లో ఉన్న తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు నబీల్.
నబీల్ మీరు వెళ్లొచ్చు అని బిగ్‌బాస్ అనగానే.. నబీల్ పరుగు పరుగున వెళ్లి.. అమ్మని హగ్ చేసుకునే సీన్.. చాలా ఎమోషనల్‌గా ఉంది. ఈ క్రమంలో టేస్టీ తేజ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన అమ్మను హౌస్‌లోకి తీసుకుని రావాలనేది అతని కల. సీజన్ 7లో ఆ కల నిజం కాలేదు. ఈ సీజన్‌లో అయినా తీసుకు రావాలనుకుంటే.. అదీ కుదరక తన తల్లి ఫ్యామిలీ వీక్‌లో వచ్చే ఛాన్స్ మిస్ అయ్యిందనే బాధలో.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నబీల్, వాళ్ల మదర్ ఇద్దరూ కూర్చొని మాట్లాడుతూ.. "ఇంటిపై బెంగగా ఉంది.. అందరూ గుర్తొస్తున్నారు" అని నబీల్ చెప్పడంతో.. ‘"కప్పు గెలవాలంటే తప్పదు మరి" అని కొడుక్కి ధైర్యం చెప్పింది.