Actress Who Changed Clothes In Car : సినిమాల్లో నటించే ఛాన్స్ రావడమంటే అంత ఈజీ కాదు. వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. షూటింగ్ స్పాట్‌లోని వాతావరణం మొదలుకొని ఫుడ్, షెల్టర్ వంటి విషయాల్లోనూ పలు మార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ కథానాయికలే చెప్పిన సందర్భాలను చూసుంటాం. అలాగే ఓ హీరోయిన్ కూడా తన షూటింగ్ లొకేషన్లో తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నారట. కారులోనే బట్టలు మార్చుకున్నారట. ఆమె ఎవరో కాదండీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్. ప్రముఖ డైరెక్టర్ సుజోయ్ ఘోష్ ఇటీవలె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమెకు సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్‌ను గురించి చెప్పుకొచ్చారు. 'కహానీ' సినిమా తీస్తున్నప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
"విద్యాబాలన్ తలుచుకుంటే కహానీ సినిమాను రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే 2009లో నేను డైరక్ట్ చేసిన అలాడిన్ సినిమా బాక్సాఫీసు వద్ద అంతంత మాత్రంగానే ఆడింది. అప్పటికే డర్టీ పిక్చర్‌తో హిట్ దక్కించుకున్న ఆమె నా సినిమాకు నో చెప్తారనే అంతా అనుకున్నారు. కానీ ఆమె అలా చేయలేదు. అందుకే నాకెప్పుడూ ఆమె మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ షారూక్ ఖాన్‌లతో సమానంగా కనిపిస్తారు. చాలా తక్కువ బడ్జెట్ కారణంగా కహానీ సినిమా షూటింగ్ సమయంలో మేం విద్యా బాలన్ కోసం వ్యానిటీ వ్యాన్ కూడా ఏర్పాటు చేయలేకపోయాం. పోనీ వేరే చోట ఎక్కడైనా ఏర్పాటు చేయాలంటే, హీరోయిన్ డ్రెస్ ఛేంజ్ చేసుకుని వచ్చేంత వరకూ షూటింగుకు బ్రేక్ వేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఖర్చులు మరింత పెరుగుతాయి. మా పరిస్థితి ఆమెకు తెలియజేశాం. ఆమె అర్థం చేసుకుని కార్లోనే డ్రెస్ ఛేంజ్ చేసుకుంటానన్నారు. రోడ్ మధ్యలో కారు ఉంచి దాని చుట్టూ నల్లని క్లాత్ కప్పి ఉంచితే అందులో డ్రెస్ ఛేంజ్ చేసుకుని షూట్‌కు వచ్చేవారు. ఇందుకు ఆమెను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే" అంటూ విద్యాబాలన్‌ను ప్రశంసించారు సుజయ్.
ఈ సినిమాలో విద్యా బాలన్‌తో పాటు నవాజుద్దీన్ సిద్దిఖీ, పరంబ్రాతా ఛటర్జీలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సుజయ్ ఘోష్ సహ రచయిత, సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇదే కాకుండా ఝాన్కార్ బీట్స్, అలాడిన్, బ్యాంగ్ బ్యాంగ్, కహానీ 2: దుర్గా రాణి సింగ్, తీన్, బద్లా, జానే జాన్, బ్లైండ్ సినిమాలకు దర్శకత్వం వహించారు సుజయ్.