Malaika Arora Father Kills Self : బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసం టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా ప్రదేశంలో ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి నోట్ లభించలేదని అధికారులు తెలిపారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అన్నారు.
అయితే అనిల్ అరోరా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఘటన జరిగిన సమయంలో మలైకా అరోరా ఇంట్లో లేరని తెలిసింది. ప్రస్తుతం ఆమె పుణెలో ఉన్నారట. సమాచారం తెలుసుకుని వెంటనే ఆమె ముంబయికి బయలుదేరారని తెలుస్తోంది. ఇంకా అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్(సల్మాన్ ఖాన్ సోదరుడు) ఘటనా స్థలానికి చేరుకున్నారట. అయితే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఎవరూ అనిల్ అరోరా ఆత్మహత్య విషయమై స్పందించలేదు.
కాగా, మలైకా అరోరాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మలైకా అరోరా ఆమె తల్లి జాయిస్ పాలికార్ప్‌తో పాటు ఆమె సోదరి అమృతా అరోరాతో కలిసి ఉన్నారు.