Open SSC And Inter Admissions 2025 : చదువుకోవాలని తపన ఉన్నా, కొన్ని కారణాలతో చదువుకు దూరమైన వారు ఉన్నారు. వారు మళ్లీ చదువుకునేందుకు తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం ఓపెన్ స్కూల్ సొసైటీ అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇది వరకే ప్రవేశాల ప్రక్రియ పూర్తయినప్పటికీ అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తూ ఈ నెల 27 నుంచి 29 వరకు తత్కాల్ విధానంలో ప్రవేశాలను కల్పిస్తోంది. పది, ఇంటర్ చదుకోవాలనే వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు.
బోధనా విధానం : స్కూల్ మధ్యలో మానేసిన వారు పది, పది పూర్తయిన వారు ఇంటర్ చదవచ్చు. పదో తరగతికి 14 సంవత్సరాలు, ఇంటర్‌కు 15 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. సరళ విద్యా విధానం, సెలవు రోజుల్లో మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. మహిళలు, వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు, ప్రజాప్రతినిధులు, సామాజిక, ఆర్థికంగా వెనక బడిన వారికి ఇది సదావకాశం. స్వీయ అభ్యసన సామగ్రి ఇంటికే పంపిస్తారు. యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ ద్వారా పాఠ్యాంశాలు నేర్చుకోవచ్చు. ఒకసారి ప్రవేశం పొందిన నుంచి 5 ఏళ్లు లేదా 9 సార్లు పబ్లిక్ పరీక్షలు రాయవచ్చు.
దరఖాస్తు విధానం :ఆన్లైన్ ఏపీ, టీఎస్ ఆన్లైన్, మీసేవ కేంద్రాలతో పాటు https:///www.telanganaopenschool.org వెబ్సైట్లో ఈ నెల 27, 28, 29వ తేదీల్లో మాత్రమే దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. కేవలం 3 రోజులు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు. దీంతో చదువుపై ఆసక్తి ఉన్నవారు, పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న చిరుద్యోగులు, గృహిణులు, వ్యాపారాల్లో రాణిస్తున్న వారు సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
తెలంగాణ 'టెట్' షెడ్యూల్ వచ్చేసింది - పరీక్షలు ఎప్పటినుంచంటే?