Amaran Movie Student Case : శివ కార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ 'అమరన్'. రీసెంట్గా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి టాక్ అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్ర మేకర్స్‌పై ఓ కాలేజీ స్టూడెంట్ నోటీసులు పంపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆ ఫోన్ నెంబర్ వల్లనే!
విఘ్నేశన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి తాజాగా మూవీ టీమ్‌కు నోటీసులు పంపించాడు. తన నెంబర్‌ను ఈ సినిమాలో చూపించారని, దాని వల్ల తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా సాయిపల్లవి ఫ్యాన్స్ నుంచి తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని అన్నాడు. దీని వల్ల అతడు బాగా ఇబ్బందిపడుతున్నానని, ఎంతో మానసిక వేదనకు గురయ్యానని వాపోయాడు. ఈ క్రమంలో తనకు రూ.కోటి నష్టపరిహారంగా డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త నెట్టింట తెగ ట్రెెండ్ అవుతోంది.
ఇక 'అమరన్' విషయానికి వస్తే, దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. 2014లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ వరదరాజన్ మృతి చెందారు. ఆయన జీవిత ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ ముకుంద్‌గా శివకార్తికేయన్, తన భార్య ఇందు పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ఆడియెన్స్ నుంచి ప్రశంసలను అందుకున్నారు. వీరిద్దరి నటన, డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి టేకింగ్‌పై సినీ దిగ్గజాలు కూడా పొగడ్తల వర్షం కురిపించారు.