96th Oscar Awards ceremony Live Streaming OTT :ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక భావించే పురస్కారం ఆస్కార్. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలనుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఎంతో మంది కళాకారులు ఆరాటపడుతుంటారు. బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టడం ఒక విజయం అయితే ఆస్కార్‌ను అందుకోవడం తమ జీవితంలో ఓ వరంలా భావిస్తుంటారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంటే ఆ ఆనందానికి హద్దులే ఉండవు. మరో నాలుగు రోజుల్లో 96వ ఆస్కార్ అవార్డ్ వేడుక గ్రాండ్‌గా జరగనుంది.
అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ఈ అకాడమీ అవార్డ్స్ వేడుకలను భారతీయులకు లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు నిర్వాహకులు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ నాలుగో సారి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతుండటం విశేషం.
భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా తెలిపింది. ఈ సందర్భంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలను జోడించి ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.