Delhi Polls BJP Manifesto : దిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, భారతీయ జనతా పార్టీ తమ మ్యానిఫెస్టో రెండో భాగాన్ని విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంకల్ప పత్రను ఎంపీ అనురాగ్ ఠాకూర్ మంగళవారం విడుదల చేశారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, స్టేట్ పీసీఎస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రకటించిన బీజేపీ, రెండు అటెంప్ట్ల వరకు రూ.15,000 అందించనున్నట్లు వెల్లడించింది. బీఆర్ అంబేడ్కర్ స్టైపెండ్ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్ నైపుణ్య కేంద్రాల్లో సాంకేతిక కోర్సులు అభ్యసించే షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,000 అందించనున్నట్లు తెలిపింది.
ఆటో-టాక్సీ డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, డ్రైవర్లకు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. అవే ప్రయోజనాలతో గృహ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే ప్రణాళిక ఉన్నట్లు తెలిపింది. ఆప్ ప్రభుత్వ అక్రమాలు, మోసాలపై దర్యాప్తు చేయడానికి SITని ఏర్పాటు చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి ప్రకటించారు.
మరోవైపు, బీజేపీ మ్యానిఫెస్టోపై మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రమాదకరమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను నిలిపివేయాలని, మొహల్లా క్లినిక్‌లతో సహా ఉచిత ఆరోగ్య సేవలను రద్దు చేయాలని పార్టీ యోచిస్తోందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని ఓటర్లను కోరారు.
కాగా, బీజేపీ మ్యానిఫెస్టో తొలి భాగాన్ని జనవరి 17వ తేదీన కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీలు ఇచ్చి, 60-70 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.2,500, 70ఏళ్లు పైబడిన వారికి రూ.3,000 పెన్షన్ వంటి కొత్త పథకాలు ప్రకటించారు. మహిళల కోసం మాతృ సురక్ష వందన పథకం కింద ప్రతి గర్భిణీకి ఆరు పోషకాహార కిట్లు, రూ.21,000 అందిస్తామని తెలిపారు. 70 మంది సభ్యులు ఉన్న దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనుండగా, ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడుతాయి.