Rishabh Pant Lucknow Super Giants : టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ రిషభ్ పంత్ తాజాగా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్ టీమ్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు అతడు కొత్త కెప్టెన్‌గా అవతరించాడు. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత గొయెంకా పంత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 14-15 ఏళ్లు ఎల్‌ఎస్‌జీ తరఫున పంత్ ఆడతాడని, ఆ సమయంలో కనీసం ఐదు ఐపీఎల్ టైటిళ్లను అతడు సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
"రిషభ్ పంత్ ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్‌గా మాత్రమే కాక టోర్నీలో అత్యుత్తమ ఆటగాడు అవుతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. తనకు ఆటపై ప్రేమ, గెలవాలనే తపన ఉన్నాయి. అటువంటి ఆటగాళ్లను నేను చూడలేదు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ లాంటి జట్లను సక్సెస్ఫుల్ టీమ్స్‌గా చెబుతారు. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, అద్భుతంగా ఆడి తమ టీమ్‌లను ముందుండి నడిపించారు. నా మాటలు మీరందరూ గుర్తుంచుకోండి. 10 ఏళ్ల తర్వాత ప్రజలు ధోనీ, రోహిత్‌లతో పాటు పంత్ పేరును కూడా చెబుతారు. భారీ ధర దక్కించుకోవడం వల్ల పంత్‌పై అదనపు ఒత్తిడి ఉండదు. వేలం పూర్తవడం వల్లే దాని గురించి చర్చ ముగిసింది. ప్రతి జట్టు రూ.120 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఒకే ఆటగాడి కోసం ఎంత ఖర్చు చేశారనేది, ముఖ్యం, మిగిలిన ఆటగాళ్ల కోసం ఎంత వెచ్చించారన్నది కాదు" అని సంజీవ్ గొయెంకా అన్నారు.
ఇదిలా ఉండగా, పంత్ కుడా తనకు దక్కిన ఈ కొత్త బాధ్యతల గురించి మాట్లాడాడు. జట్టుకు టైటిల్ తెచ్చేందుకు 200 శాతం కృషి చేస్తానని పేర్కొన్నాడు.
"లఖ్‌నవూ జట్టుకు ఫస్ట్ టైటిల్‌ను ఇచ్చేందుకు 200 శాతం కృషి చేస్తాను. కొత్త ఎనర్జీతో ఎల్‌ఎస్‌జీ తరఫున ఆడేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కొత్త జట్టు, కొత్త ఫ్రాంఛైజీ. కానీ కెప్టెన్‌గా నా దృక్పథం మాత్రం ఏమాత్రం మారదు. ఓ సారథిగా నా కో ప్లేయర్స్‌తో ఎలా నడుచుకోవాలో రోహిత్ అన్న నుంచే నేర్చుకున్నాను. ప్లేయర్లపై నమ్మకం ఉంచితే ఊహించని ఫలితాలు వస్తాయి" అని పంత్ అన్నాడు.
లఖ్‌నవూ కెప్టెన్‌గా పంత్- అఫీషియల్ అనౌన్స్మెంట్!
33 బంతుల్లో ఫాస్టెస్ట్ 50 - తన రికార్డునే బ్రేక్ చేసిన పంత్!