12th Fail Supreme Court Screening :బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మస్సే లీడ్ రోల్లో, ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ బయోపిక్‌గా తెరకెక్కిన '12th ఫెయిల్' మూవీ ఇప్పటికే పలు అవార్డులతో పాటు ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కోసం సుప్రీంకోర్టులో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇక ఈ స్క్రీనింగ్‌లో ఆయనతో పాటు పలువురు న్యాయవాదులు, 600 మంది సుప్రీంకోర్టు అధికారులు, వారి కుటుంబసభ్యులు, అలాగే మూవీ టీమ్ పాల్గొని సందడి చేశారు.
ఇక సినిమా చూసిన తర్వాత సీజేఐ '12th ఫెయిల్' మూవీ టీమ్‌ను మెచ్చుకున్నారు. ఇది ఓ ఇన్స్పిరేషనల్ మూవీ అని కొనియాడారు.
"చుట్టూ ఉన్న ప్రజల కోసం ఏదైనా చేసేలా ఉండే ఇటువంటి సినిమాలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపుతాయి. విక్రాంత్, మేధా శంకర్ ఈ మూవీలో అద్భుతంగా నటించారు. వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ చూసి నా కళ్లు చెమర్చాయి. ఆశ అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా చాలా బాగా చూపించింది. నా కో స్టార్స్, సిబ్బంది అందరి తరఫున ఈ చిత్ర బృందానికి ధన్యవాదాలు" అంటూ సీజేఐ మూవీ టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
ఇదిలా ఉండగా, సీజేఐ మాటలకు డైరెక్టర్ విదు వినోద్ చోప్రా కూడా సంతోషం వ్యక్తం చేశారు. "నా జీవితంలో ఇవి ఎంతో అందమైన క్షణాలు. సీజేఐతో కలిసి ఈ సినిమాను చూడటం ఎంతో ఆనందంగా ఉంది. సుమారు ఐదేళ్లు శ్రమించి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఆయన మాటలతో నా శ్రమకు తగిన విలువ దక్కినట్లు అనిపించింది" అని చోప్రా తెలిపారు.