Zero Cost Term Insurance :ఇన్సూరెన్స్ అనేది ఈ కాలంలో తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో మన వారికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్‌లు అందుబాటులో మనకు ఉన్నాయి. అయితే టర్మ్ ఇన్సూరెన్స్‌లు ఆర్థిక స్థోమత, రక్షణ పరంగా అనుకూలంగా ఉంటాయి. కానీ వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు బతికి ఉంటే చెల్లింపులు ఉండవు. దీన్ని పరిష్కరించడానికి 'జీరో కాస్ట్' టర్మ్ ప్లాన్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. మరి దీన్ని కొనుగోలు చేస్తే లాభమా నష్టమా?
జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్
జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వల్ల సాధారణ జీవిత బీమా పాలసీలకు అప్డేట్ వెర్షన్ అని చెప్పవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్‌లో పాలసీదారులు జీవించి ఉన్న సమయంలో ప్రీమియం చెల్లింపులు ఉండవు. కానీ, ఈ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మాత్రం పాలసీ వ్యవధి ముగిసే లోపు ప్రీమియాలను పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. మీరు చెల్లించిన ప్రీమియాలు వృథా కావు అనే భరోసాను ఇస్తాయి. పాలసీ గడువు ముగిసే లోపే ఆర్థికంగా స్వతంత్రంగా మారాలని అనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
పనితీరు ఎలా ?
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు సాధారణంగా వారి ఆర్థిక బాధ్యతలు, లక్ష్యాల ఆధారంగా పాలసీ టర్మ్‌ను ఎంచుకుంటారు. కానీ, జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్‌లో పాలసీదారులు నిర్దిష్ట సమయంలో పాలసీ నుంచి బయటికి రావడమే కాకుండా ప్రీమియం నగదును పొందే అవకాశం ఉంది. ఇందులో పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత వచ్చే కవరేజ్ మాత్రం పొందలేరు.
నిబంధనలు
జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్లు చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ పాలసీదారులు రీఫండ్ పొందాలంటే అనేక షరతులు ఉంటాయి.
- నిష్క్రమణ వ్యవధి : నగదు క్లెయిమ్ చేసుకునేందుకు, పాలసీ నుంచి బయటికి వచ్చే వ్యవధి పరిమితంగా ఉంటుంది. పాలసీ వ్యవధి ముగింపునకు దగ్గరగా ఉన్న సమయంలో మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అవకాశం ఉండదు.
- రిఫండ్ మినహాయింపులు : పాలసీ బేస్ ప్రీమియాన్ని మాత్రమే రీఫండ్ ఉంటుంది. ఇందులో రైడర్ ప్రీమియాలు, పన్నులు, ఇతర ఛార్జీలు ఉండవు.
- యాక్టివ్ పాలసీ : రీఫండ్ కావాలంటే పాలసీ యాక్టివ్‌గా ఉండాలి. చెల్లింపుల్లో జాప్యం జరిగినా, కట్టకపోయినా పాలసీదారులు రీఫండ్ క్లెయిమ్ చేయలేరు.
- రీఫండ్ తర్వాత పాలసీ రద్దు : రీఫండ్ ఇచ్చిన తర్వాత పాలసీ రద్దు అవుతుంది. తర్వాత వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కాదు.
నిజంగా జీరో కాస్టా?
పేరులో జీరో ఉన్నప్పటికీ, వాస్తవంగా అవి పూర్తిగా ఖర్చు లేనివి కావు. పాలసీదారులు చెల్లించిన బేస్ ప్రీమియాలను తిరిగి చెల్లించినప్పటికీ టైమ్, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవు. పైగా ప్రీమియం విలువ ఊహించిన దానికంటే ఎక్కువ ఉండే అవకాశముంది.