Budget 2025 Expectations : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ కోసం అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులు, చిన్నతరహా పరిశ్రమలు, విద్యారంగం, శాస్త్ర సాంకేతిక రంగంలోని పరిశోధన, అభివృద్ధి విభాగాల్లో ఈసారి పన్ను సంస్కరణలు జరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపు పన్ను సంస్కరణలు చేస్తారని అంటున్నారు. బడ్జెట్‌పై ప్రముఖ ఆర్థికవేత్తల సూచనలు, అంచనాలను ఈ కథనంలో చూద్దాం.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మద్దతు
ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 30 శాతాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(MSME) అందిస్తున్నాయి. దేశ ఆర్థిక వృద్ధిలో ఇవే కీలక పాత్రను పోషిస్తున్నాయి. అందువల్ల ఈ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి, ఆర్థిక మద్దతును అందించే ప్రకటనలు చేయాలని ఆర్థికవేత్తలు కేంద్ర సర్కారును కోరుతున్నారు. పన్ను రాయితీలతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యాలను ఎంఎస్ఎంఈలకు కల్పించాలని పీహెచ్‌డీసీసీఐ (PHDCCI) సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ డాక్టర్ ఎస్.పి.శర్మ కోరారు.
విద్యారంగం విద్యా రంగం మనదేశంలోని దాదాపు 145 కోట్ల మందికి కీలకమైంది. అన్ని వర్గాల ప్రజలకు సమాన స్థాయిలో విద్యా సౌకర్యాలు, నాణ్యమైన విద్య అనేవి ఆవశ్యక అంశాలు. ప్రైవేటు పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పన జరగాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ అందించాలి. వారికి మరింత మెరుగైన వేతనాలను, ప్రోత్సాహకాలు అందించాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. ఈ అన్ని అంశాలపై ఫోకస్ చేసే దిశగా కేంద్ర బడ్జెట్ ఉండాలని ఆర్థిక వేత్త శరద్ కొహ్లీ అన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
వైవిధ్యం దిశగా అడుగులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భారత్ శరవేగంగా ఎదుగుతోంది. భారతదేశ సత్తాను ఇస్రో సహా పలు సంస్థలు ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఈ విభాగానికి నిధుల కేటాయింపులు పెంచాలి. దేశంలోని శాస్త్ర సాంకేతిక సంస్థలను ప్రోత్సహించాలి. ఆయా సంస్థల్లోని పరిశోధనా విభాగాలకు దన్నుగా నిలవాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బ్లాక్ చైన్ సాంకేతికతలతో ముడిపడిన పరిశ్రమలను ప్రోత్సహించాలి. అన్ని రంగాల్లో ఈ సాంకేతికతల వినియోగానికి చేదోడును అందించాలని ఆర్థిక వేత్త శరద్ కొహ్లీ పేర్కొన్నారు.
మౌలిక వసతులు, మూలధన వ్యయ విభాగాలు ఈసారి కేంద్ర బడ్జెట్లో మూలధన వ్యయాలను పెంచే అవకాశం ఉందని ఆర్థిక వేత్త డాక్టర్ ఎస్.పి.శర్మ అన్నారు. కనీసం 20 నుంచి 25 శాతం మేర మూలధన వ్యయాలను పెంచాలని ఆయన కోరుతున్నారు. దేశపు ఆర్థిక పురోగతి కోసం అద్భుతమైన మౌలిక సదుపాయాలు తప్పకుండా అవసరమని డాక్టర్ ఎస్.పి.శర్మ తెలిపారు.
వివిధ రంగాలవారీగా అంచనాలివీ
విమానయాన రంగం
విమానయాన రంగం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు. టికెట్ల ధరలు తగ్గాలని కోరుకుంటున్నారు. విమాన సర్వీసుల నిర్వహణ వ్యయాలు తగ్గాలని విమానయాన పరిశ్రమ కోరుకుంటోంది. ఇందుకోసం విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఆర్థిక వేత్త శరద్ కొహ్లీ కోరారు. సామాన్యులకూ విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలన్నారు.
పెట్రోలియం
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి వాటి ధరలను హేతుబద్ధీకరించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. దీనివల్ల వాటిపై ద్రవ్యోల్బణం ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ వంటి దిగుమతులపై ఆధారపడటాన్ని దేశం తగ్గించాలని వారు సూచన చేస్తున్నారు. పర్యావరణ హితమైన పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని నిపుణులు చెబుతున్నారు.
స్టార్టప్‌లు దేశంలో స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అత్యధిక స్టార్టప్‌ల విషయంలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. స్టార్టప్‌లపై విధించే పన్నులను హేతుబద్ధీకరించి, వాటికి తగినన్ని రాయితీలను అందించే అవకాశం ఉందని ఆర్థికవేత్త డాక్టర్ ఎస్.పి.శర్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలతో పోటీపడేలా స్టార్టప్‌లను తీర్చిదిద్దాలంటే వాటికి ప్రభుత్వం సహకారం అవసరమన్నారు. 2030 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దడంపై కేంద్ర సర్కారు ఫోకస్ పెట్టాలని ఆయన కోరారు.
ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, బ్లాక్ చైన్ సాంకేతికతల్లో పరిశోధన-అభివృద్ధి (ఆర్అండ్డీ) కోసం తగినన్ని నిధులను కేటాయించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. తద్వారా ఆయా విభాగాల్లో ఇతర దేశాలతో భారత్ పోటీపడే అవకాశం ఉంటుందన్నారు. అయితే ఏఐ వినియోగంపై అతిగా ఆధారపడితే పలు రంగాల్లో ఉద్యోగ కోతలు విధించే పరిస్థితి ఉత్పన్నం కావచ్చని నిపుణులు హెచ్చరించారు.
టెలికాం అండ్ కనెక్టివిటీ స్వదేశీ 6జీ టెక్నాలజీని అభివృద్ధి చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. టెలికాం రంగంలోకి మరిన్ని కంపెనీలను ఆహ్వానిస్తే బాగుంటుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. తద్వారా ఆయా టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరిగి, తక్కువ ధరకే టెలికాం సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. తక్కువ రేటుకే ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలు సమకూరితే దేశ వికాసం మరింత వేగవంతం అవుతుందని నిపుణులు తెలిపారు.