What Is Silver ETF :మీరు భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? అయితే సిల్వర్ ఈటీఎఫ్‌లు మీకు బెస్ట్ ఆప్షన్ అవుతాయని చెప్పవచ్చు. 'ఈటీఎఫ్' అంటే ‘ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్’. నేడు చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్‌లు, సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. అంటే డిజిటల్ ఫార్మాట్లో బంగారం, వెండికి సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌కు, ఈటీఎఫ్‌లకు చాలా తేడా ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌ను కొనేందుకు మనం ఏదో ఒక ఆర్థిక సంస్థ లేదా బ్యాంకుకు సంబంధించిన ఫండ్ హౌజ్‌లో పెట్టుబడి పెట్టాలి. కానీ ఈటీఎఫ్‌లను మనం నేరుగా సాధారణ స్టాక్ మార్కెట్ షేర్లలాగే కొనేయొచ్చు. డీమ్యాట్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. లాంగ్ టర్మ్ వ్యూహంతో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి సిల్వర్ ఈటీఎఫ్‌లు మంచి మార్గమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవర్ గ్రీన్ మెటల్ - సిల్వర్
వెండిని ఎవర్ గ్రీన్ మెటల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెలి కమ్యూనికేషన్, ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి పారిశ్రామిక రంగాలలో సిల్వర్‌కు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. మెరుగైన మన్నిక, విద్యుత్ వాహక స్వభావాన్ని కలిగి ఉండటం అనేవి సిల్వర్‌కు ఉండే గొప్ప గుణాలు. అందుకే పరిశ్రమల్లో వినియోగించే చాలా ఉపకరణాల తయారీలో సిల్వర్ అనేది అత్యంత కీలకమైన లోహంగా ఉంది. టెలీ కమ్యూనికేషన్, ఆటో మొబైల్ రంగాలకు చెందిన చాలా పరికరాలు, విడి భాగాల తయారీలో సిల్వర్‌ను పెద్ద మొత్తంలో వినియోగిస్తుంటారు. సోలార్ ప్యానల్స్ తయారీలోనూ సిల్వర్నే ప్రధానంగా వినియోగిస్తుంటారు. అందుకే ఈ రంగాల నుంచి సిల్వర్ ఉత్పత్తి సంస్థలకు భారీగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో లభ్యత తక్కువగా ఉండటం, పెద్దమొత్తంలో డిమాండ్ ఉండటం అనేది సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టే వారికి కలిసొచ్చే కీలక అంశం. సిల్వర్ లభ్యతలో చోటుచేసుకునే హెచ్చుతగ్గులను నిరంతరం నిశితంగా గమనిస్తూ, లబ్ధి పొందాలని భావించే వారికి సిల్వర్ ఈటీఎఫ్‌లు మంచి పెట్టుబడి మార్గం.
డిజిటల్ ఫార్మాట్లో సిల్వర్ ఈటీఎఫ్‌లు
ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కోటక్, ఐసీఐసీఐ, నిప్పన్, ఆదిత్య బిర్లా సంస్థలు ప్రత్యేక సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్లను నిర్వహిస్తున్నాయి. వీటిలో చేరి మనం కూడా సిల్వర్ ఈటీఎఫ్‌లు కొనొచ్చు, అమ్మొచ్చు. ఈ ఆర్థిక సంస్థలు సిల్వర్ రంగంలో ముడిపడిన కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఆయా కంపెనీల్లోని సిల్వర్ స్టాక్ ఆధారంగా, ఈ ఆర్థిక సంస్థలు తమ పెట్టుబడిదారులకు సిల్వర్ ఈటీఎఫ్‌లను డిజిటల్ ఫార్మాట్లో జారీ చేస్తుంటాయి. మనం కొనే సిల్వర్ స్టాక్ సేఫ్టీ గురించి, నిల్వ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అవి డిజిటల్ ఫార్మాట్లో ఉంటాయి. డీమ్యాట్ ఖాతా లేని పెట్టుబడిదారులు కూడా సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్ఓఎఫ్)లలో పెట్టుబడి పెట్టొచ్చు.