Emergency Loan Credit Check : జీవితంలో ఆర్థిక అత్యవసరం ఎప్పుడైనా రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇంబ్బందుల నుంచి బయటపడటానికి చాలా మంది ఎమర్జెన్సీ లోన్స్ కోసం చూస్తారు. వీటిని ఇన్స్టంట్ లోన్స్ అని కూడా అంటారు. మెడికల్ ఎమర్జెన్సీ అయినా, కార్ రిపేర్ అయినా, ఇళ్ల రెనొవేషన్ అయినా ఈ ఎమర్జెన్సీ లోన్స్ అవసరాలను తీరుస్తాయి. ప్రస్తుతం డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఈ ఎర్జెన్సీ లోన్లకు హాట్స్పాట్లుగా మారాయి. ఇందులో చాలా మంది రుణదాతలు- ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్లు మంజూరు చేస్తున్నారు. లోన్ ఇచ్చే ముందు రుణ గ్రహీత క్రెడిట్ చెక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు క్రెడిట్ చెక్ అంటే ఏమిటి? ఈజీగా ఎమర్జెన్సీ లోన్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ చెక్ అంటే ఏమిటి?
ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ రిపోర్ట్, క్రెడిట్ స్కోర్‌ను రుణ దాత తనిఖీ చేయడాన్ని క్రెడిట్ చెక్ అంటారు. ఒక వ్యక్తి రుణం తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నాడా లేదా అనేది వారి రుణ అర్హతను అంచనా వేయడానికి ఇది ఆర్థిక సంస్థలకు ఉపయోగపడుతుంది.
భారత దేశంలో ట్రాన్స్‌యూనియన్ CIBIL జారీ చేసిన క్రెడిట్ స్కోర్ ప్రజాదరణ పొందింది. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750 అంతకంటే ఎక్కువ స్కోరు మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రెడిట్ చెక్‌లు రెండు రకాలు ఉన్నాయి. హార్డ్ క్రెడిట్ చెక్, సాఫ్ట్ క్రెడిట్ చెక్.
హార్డ్ క్రెడిట్ చెక్
రుణ గ్రహీత క్రెడిట్ కార్డ్ లేదా లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు హార్డ్ చెక్ జరుగుతుంది. రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి రుణదాతలు- రుణగ్రహీతల క్రెడిట్ రిపోర్ట్‌ను తీసుకుంటారు. హార్డ్ క్రెడిట్ చెక్ వల్ల క్రెడిట్ స్కోర్ తాత్కాలికంగా కొద్దిగా తగ్గించవచ్చు. కానీ లోన్ అప్రూవల్ కోసం ఇది అవసరం.
సాఫ్ట్ క్రెడిట్ చెక్
సమాచార ప్రయోజనాల కోసం రుణ గ్రహీతల క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేయడం సాఫ్ట్ చెక్. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయదు. ఈ సాఫ్ట్ చెక్‌లను తరచుగా బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ల కోసం ఉపయోగిస్తారు.
క్రెడిట్ చెక్‌ను ఎలా క్లియర్ చేయాలి?
- మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి : దీని కోసం మీ CIBIL స్కోర్‌ను తనిఖీ చేసుకోండి. స్కోర్ తక్కువగా ఉంటే, మీకున్న లోన్ భారాన్ని తగ్గించడం, లోపాలను సరిదిద్దడం, క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తగ్గించడం వంటి చర్యలు తీసుకోండి.
- స్థిరమైన ఉద్యోగం : మీకు స్థిరమైన ఉద్యోగం ఉందని నిరూపించడానికి గత 3 నెలల శాలరీ స్లిప్‌లను అందించండి.
- తరచుగా లోన్స్ కోసం అప్లై చేయకండి : అత్యవసర రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు లోన్స్ లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయకండి.
- అవసరమైతే పూచీకత్తును అందించండి : మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా లేదా తక్కువ క్రెడిట్ హస్టరీ ఉన్నా పూచీకత్తును అందించడం వల్ల మీ లోన్ అప్రూవ్ అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. సెక్యూర్డ్ రుణాలు రుణదాతలకు తక్కువ ప్రమాదకరం.
- ఈ ఆప్షన్ పరిశీలించండి : మీ క్రెడిట్ స్కోరు అంతగా లేకపోయినా, కొంతమంది రుణదాతలు మీ ఆదాయ స్థాయి లేదా బ్యాంకుతో ఉన్న సంబంధం ఆధారంగా అత్యవసర రుణాలను అందించవచ్చు.