Highest FD Rates for Senior Citizens:కష్టపడి సంపాదించిన సొమ్మును పొదుపు చేయడం వల్ల ఆర్థికంగా క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే మన దేశంలో చాలా మంది తాము దాచుకున్న డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా బ్యాంకులు వడ్డీ రేట్లను చెల్లించడమే ఇందుకు కారణం. అందుకోసమే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు.
అయితే, ఎక్కువగా సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. ప్రస్తుతం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లలో 56 శాతానికిపైగా సీనియర్ సిటిజన్లే చేసినట్లు ఓ నివేదికలో తేలింది. ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే.. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సైతం మంచి వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎక్కువగా వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని పెద్ద బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీ రేటు కల్పిస్తోంది సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మరి ఇందులో ఎంత వడ్డీ రేటును అందిస్తోంది? రూ.5 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వడ్డీ రేట్లు ఇవే: సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా సాధారణ వినియోగదారులకు 9.10 శాతం వడ్డీ కల్పిస్తుంటే... సీనియర్ సిటిజన్లకు మాత్రం 9.60 శాతం మేర వడ్డీని అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ బ్యాంకులు సైతం 8 శాతం లోపే వడ్డీ ఇస్తున్న సమయంలో.. ఈ బ్యాంక్ ఏకంగా 9.60 శాతం వడ్డీ కల్పిస్తోంది. అంతేకాదు.. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లోనూ డబ్బులు సురక్షితమనే చెప్పాలి. ఎందుకంటే ఇందులోనూ డిపాజిటరీ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ దివాలా తీసినా సరే.. రూ.5 లక్షల వరకు డబ్బులు అందుతాయి.