What Is Uniform KYC : బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, బీమా తీసుకోవాలన్నా, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్నా లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఇలా ప్రతి దానికి ప్రత్యేకంగా కేవైసీ చేయాల్సిందే. అంటే కేవైసీ లేకుండా మీరు బ్యాంక్ ఖాతాను తెరవలేరు. జీవిత, ఆరోగ్య బీమాలను కొనుగోలు చేయలేరు. అవసరమైన పత్రాలు ఇచ్చి, కేవైసీ అప్‌డేట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఆర్థిక సేవలను ఉపయోగించుకోగలరు. ఇలా వేర్వేరు పనుల కోసం పదే పదే కేవైసీ చేయడం, మళ్లీ వాటిని విడివిడిగా అప్‌డేట్ చేస్తుండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారించేందుకు 'యూనిఫామ్ కేవైసీ' పద్ధతిని తీసుకువచ్చేందుకు ఫైనాన్స్ స్టెబిలిటీ, డెవలప్మెంట్ కౌన్సిల్ ఒక ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం, ఆర్థిక రంగంలోని అన్ని వ్యవహారాల్లో యూనిఫామ్ కేవైసీ అమలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. దీనితో కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది యూనిఫామ్ కేవైసీ అమలుకు ఓకే చెబితే, ఇకపై ప్రతిదానికీ విడివిడిగా కేవైసీ చేయాల్సిన అవసరం ఉండదు.
సెంట్రలైజ్డ్ కేవైసీ రిజిస్ట్రీ :
ఆర్థిక మంత్రిత్వ శాఖ 2016 సంవత్సరంలో 'సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ' (CKYCR)ని ఏర్పాటు చేసింది. ఇది క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన కేవైసీ రికార్డులను మాత్రమే మెయింటైన్ చేస్తుంది. బ్యాంకింగ్, బీమా వంటి ఇతర ఆర్థిక సేవలకు సంబంధించిన కేవైసీ రికార్డ్లను ఇది కవర్ చేయదు.
ప్రతిపాదిత మార్పులు:
ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం, కేవైసీ వివరాలు సమర్పించిన తర్వాత వినియోగదారులు - వారి ఐడీ ప్రూఫ్నకు లింక్ చేసిన ప్రత్యేక సీకేవైసీ ఐడెంటిఫైయర్‌ను పొందుతారు. ఈ ఐడెంటిఫైయర్ రిపోర్టింగ్ ఎంటిటీస్లకు సెంట్రల్ రిజిస్ట్రీ నుంచి కేవైసీ రికార్డులను యాక్సెస్ చేసేందుకు పర్మిషన్ ఇస్తుంది. దీని వల్ల ప్రతిసారీ కేవైసీ చేయాల్సిన పని తప్పుతుంది.