What Happens When You Delay Home Loan : హోమ్ లోన్లు దీర్ఘకాల ఫైనాన్సియల్ కమిట్మెంట్స్. ఈఎమ్ఐలు క్రమానుగుణంగా సకాలంలో కట్టడం చాలా అవసరం. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, ఇంటిని కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యం. అయితే, ఈఎమ్ఐలు కట్టడం మిస్ అయినా లేదా లేట్ అయినా రుణగ్రహీతలు చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లేట్ పేమెంట్ పెనాల్టీలు
గృహ రుణం ఈఎమ్ఐ కట్టడం లేట్ అయినా, గడువు తేదీ ముగిసిన తర్వాత చెల్లించినా రుణదాతలు పెనాల్టీ రుసుము వసూలు చేస్తారు. సాధారణంగా పెనాల్టీలో ఫ్లాట్ ఫీజు లేదా ఓవర్‌డ్యూ అమౌంట్ ఉంటుంది. ఉదాహరణకు బకాయి ఉన్న ఈఎమ్ఐలో నెలకు 2శాతం నుంచి 3శాతం వరకు పెనాల్టీ విధించవచ్చు. ఇది మీరు చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని పెంచుతుంది.
2. క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం
ఈఎమ్ఐ చెల్లింపులు ఆలస్యం అయితే మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈఎమ్ఐలు మిస్ అయితే క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. ఫలితంగా భవిష్యత్తులో లోన్లు, క్రెడిట్ కార్డులు, లేదా అనుకూలమైన వడ్డీ రేట్లను పొందడం కష్టతరం అవుతుంది. చాలా వరకు బ్యాంకులు- మీరు మిస్సైన ఈఎమ్ఐల వివరాలను సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తాయి. ఇది మీ క్రెడిట్ కార్డు హిస్టరీని దెబ్బతీస్తుంది.
3. పెరిగిన వడ్డీ
మీరు ఈఎమ్ఐ చెల్లించడం మిస్ అయినప్పుడు- బకాయి మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్‌కు(అసలు) యాడ్ చేస్తారు. దీంతో ఆ మొత్తంపై వడ్డీ పెరుగుతుంది. అంటే మీరు ఈఎమ్ఐ కట్టడం ఆలస్యం చేసినకొద్దీ లోన్ బ్యాలన్స్ పెరుగుతుంది. దీంతో ఫ్యూచర్లో లోన్‌ను చెల్లించడం కష్టమవుతుంది. ఇక రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితి దిగజారితే, చెల్లింపు వ్యవధిని పొడగించుకోవచ్చు.
4. రుణదాలత నుంచి నోటీసులు
ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ ఈఎమ్ఐలు చెల్లించడం మిస్ అయితే లేదా కట్టలేకపోతే, దాని గురించి గుర్తుచేయడానికి మీ రుణదాత డిఫాల్ట్ నోటీసులను పంపిస్తారు. ఆ నోటీసుల్లో మీరు కట్టాల్సిన బకాయిలు, చెల్లించడం ఆలస్యం చేస్తే ఎదుర్కొవాల్సిన పరిణామాలను వివరిస్తారు. మీరు ఆ నోటీసులను విస్మరిస్తే రుణదాతలు మరింత తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
5. చట్టపరమైన చర్యలు
సాధారణంగా, మీరు 3-6 నెలల పాటు ఈఎమ్ఐలు చెల్లించడంలో విఫలమైతే- మీ లోన్‌ను రుణదాతలు నిరర్థకంగా(నాన్ పెర్ఫార్మింగ్) పరిగణించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు మీ ఆస్తిని సెక్యూరిటీగా పెట్టి లోన్ తీసుకుంటే- SARFAESI చట్టం ప్రకారం రుణదాతకు మీ ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది.