Post Office Senior Citizen Savings Scheme : పదవీవిరమణ తర్వాత సుఖంగా జీవించడానికి తప్పనిసరిగా ముందుగానే ఆర్థిక ప్రణాళికను వేసుకోవాలి. ఉద్యోగం చేస్తున్న సమయం నుంచి సరైన విధంగా పొదుపు చేస్తే, వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. అదే విధంగా పదవీవిరమణ చేసిన తర్వాత కూడా, మీ దగ్గర ఉన్న డబ్బును మంచి పథకాలలో పెట్టుబడి పెట్టి అధిక రాబడిని పొందొచ్చు. ఇందుకోసం అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వాటిలో సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి.
పోస్టాఫీసు సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ వల్ల ప్రయోజనాలు
1. అధిక వడ్డీ రేటు
పోస్టాఫీసు సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై 8.2శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇది అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేటు కంటే ఎక్కువ. ఈ పథకం మీ పెట్టుబడి భద్రతను నిర్ధరించడమే కాకుండా ప్రతి నెలా ఆదాయాన్ని అందిస్తుంది.
2. పెట్టుబడి
కనీసం రూ.1000 పెట్టుబడితో సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్ఠంగా రూ.30 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడి సీనియర్ సిటిజన్లకు గణనీయమైన కార్పస్‌ను పొందేందుకు వీలు కల్పిస్తుంది.
3. నెలవారీ ఆదాయం
నెలవారీ ఆదాయం పొందాలనుకునే వారికి సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ మంచి ఆప్షన్ అవుతుంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే వారు ప్రతి నెలా రూ.20,000 వడ్డీని పొందుతారు. రూ.30లక్షల పెట్టుబడిపై 8.2శాతం వడ్డీ అందుతుంది. దీంతో మీ పెట్టుబడిపై రూ.2.46 లక్షల వార్షిక వడ్డీ లభిస్తుంది. అంటే నెలకు రూ.20,500 ఆదాయం అన్నమాట.
4. పన్ను ప్రయోజనాలు
సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు లభిస్తాయి.
5. మెచ్యూరిటీ వ్యవధి
సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు. అయితే ఈ మెచ్యూరిటీ వ్యవధికి ముందే ఖాతాను క్లోజ్ చేస్తే కస్టమర్‌కు ఫైన్ పడుతుంది.
6. వయోపరిమితి
ఈ పథకంలో 60ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పెట్టుబడి పెట్టొచ్చు. 55-60 ఏళ్ల మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవారు కూడా ఈ పథకానికి అర్హులే. దేశ రక్షణ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారు 50 ఏళ్లకే ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంటుంది.
అకౌంట్‌ను ఓపెన్ చేయడం ఎలా?
ఏదైనా పోస్టాఫీసు బ్రాంచ్ లేదా గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెరవొచ్చు. అలాగే జీవిత భాగస్వామి లేదా 60ఏళ్లు పైబడిన వ్యక్తితో జాయింట్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు.
ఖాతాదారుడు మరణిస్తే?
ఖాతాదారుడు మెచ్యూరిటీ కంటే ముందే మరణిస్తే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. అలాగే పెట్టుబడి సొమ్ము మొత్తాన్ని వడ్డీతో కలిపి నామినీకి అందజేస్తారు.
సీనియర్ సిటిజన్స్ కోసం 7 బెస్ట్ పెట్టుబడి స్కీమ్స్- వీటిలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు!
75ఏళ్లు దాటిన వాళ్లు ఇన్‌కం ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదా? - గవర్నమెంట్ ఏం చెప్పిందంటే?