How Many SIM Cards Can Register On One Aadhaar Card : కొందరు వ్యక్తులు ఎప్పటికప్పుడు తమ ఫోన్ నంబర్లు మార్చేస్తుంటారు. పాత నంబర్ పక్కన పడేసి, కొత్తది తీసుకుంటూ ఉంటారు. కానీ పాతవాటిని బ్లాక్ చేయకుండా అలానే ఉంచుతారు. మరి మీరు కూడా ఇలానే చేస్తుంటారా? అయితే జర జాగ్రత్త! ఇకపై కొత్త సిమ్ కార్డ్ కోసం అప్లై చేస్తే, మీ అభ్యర్థనను తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే సిమ్ కార్డ్‌ల జారీపై పరిమితి ఉంది.
ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చు?
భారత్‌లో సిమ్ కార్డుల జారీపై పరిమితి ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలి. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఉచితంగా లభిస్తుండడం వల్ల చాలా మంది సిమ్ కార్డులను వాడేసి, వాటిని బ్లాక్ చేయకుండా అలానే పక్కన పడేస్తుంటారు. ఒక్కోసారి ఇలాంటివి సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంటాయి.
మరికొన్ని సార్లు మనకు తెలియకుండానే మన పేరుపై ఇతరులు సిమ్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. మీ ఆధార్‌ను దుర్వినియోగం చేసి ఈ తరహా మోసాలకు తెగబడుతుంటారు. సిమ్ స్వాప్, మోసపూరిత సిమ్ కార్డుల జారీ వల్ల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిమ్ కార్డుల జారీ నిబంధనల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ (డాట్) కఠినతరం చేసింది. దీని ప్రకారం, సామాన్యులు తమ ఆధార్ కార్డుపై గరిష్ఠంగా 9 సిమ్ కార్డులు వరకు తీసుకోవచ్చు. ఇండియాలో సామాన్యులు బల్క్‌గా సిమ్ కార్డులు తీసుకోవడంపై నిషేధం కూడా ఉంది.
మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండిలా!
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ (డాట్) ఒక ఆధార్ కార్డు పేరిట ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేందుకు TAF-COP (టెలికాం అనలిటిక్స్ ఫర్స్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటక్షన్) అనే ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చింది. దీని సాయంతో మీ ఆధార్ కార్డ్‌పై ఎన్ని సిమ్ కార్డులు జారీ అయ్యాయో తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ ఫోన్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా దాన్ని బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే?
- ముందుగా మీరు Sanchar Saathiవెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
- Citizen Centric Services లోకి వెళ్లాలి.
- Know your mobile connections పై క్లిక్ చేయాలి.
- తరువాత మీ ఫోన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి.
- వెంటనే మీ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
- వెంటనే యూజర్ పేరిట ఉన్న మొబైల్ నంబర్ల జాబితా మొత్తం కనిపిస్తుంది.
- ఆ జాబితాలో ఉన్న ఫోన్ నంబర్లు మీవేనా? కాదా? అని చెక్ చేసుకోవాలి.
- ఒక వేళ వాటిలో ఏదైనా మీది కాకపోతే, వెంటనే బ్లాక్ చేసేయాలి.
- ఈ విధంగా మీవి కాని, మీరు ఇకపై వాడని నంబర్లను పూర్తి బ్లాక్ చేసుకోవాలి.