తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం తాకట్టు పెట్టి లోన్​ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - How Does A Gold Loan Work - HOW DOES A GOLD LOAN WORK

Things To Consider Before Taking A Gold Loan : అర్జెంట్​గా లోన్ కావాలని అనుకునేవారికి గోల్డ్​ లోన్​ మంచి ఎంపిక అవుతుంది. బంగారాన్ని తాకట్టు పెడతాం కాబట్టి ఈ రుణం వేగంగా మంజూరవ్వడమే కాకుండా, ఎలాంటి అవసరానికైనా ఆ నిధులను వినియోగించవచ్చు. అయితే ఈ గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

gold loan
gold loan (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 11:11 AM IST

Things To Consider Before Taking A Gold Loan :మన దేశంలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం అనేది తరతరాలుగా వస్తున్నదే. గతంలో ఎక్కువగా ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులు, వ్యక్తుల వద్ద బంగారాన్ని ఉంచి ప్రజలు రుణాలు తీసుకునేవారు. ఇప్పుడు బంగారం తాకట్టు పెడితే చాలు, లోన్​ ఇవ్వడానికి బ్యాంకులు తమ పనిదినాలలో సిద్ధంగా ఉంటున్నాయి. బ్యాంకులు చాలా రుణాలకు క్రెడిట్‌ స్కోర్​, రుణగ్రహీత తిరిగి చెల్లించే ఆర్థిక సామర్థ్యం మొదలైన అంశాలను పరిశీలిస్తాయి. అయితే, గోల్డ్ లోన్స్​ విషయంలో బ్యాంకులు ఇవేవి చూడవు. కొన్ని బ్యాంకులు కేవలం 45 నిమిషాల్లోనే ఈ బంగారు రుణాలను అందజేస్తున్నాయి. అంటే రుణాలన్నింటిలోను బంగారంపై రుణం పొందడమే చాలా సులభంగా ఉంటుంది. అయితే గోల్డ్ లోన్స్​ కోసం దరఖాస్తు చేసే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే?

ఏ అవసరానికైనా రుణం
బ్యాంకులు - ఇల్లు, విద్యా, వాహనం, ఉత్పత్తి రంగం, వ్యాపారం ఇలాంటి అనేక అంశాల ఆధారంగా రుణాలు ఇస్తుంటాయి. అయితే, బంగారంపై రుణాలు పొందేవారిపై ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే నియంత్రణ ఉండదు. రుణం ద్వారా పొందిన నిధులను ఎలాంటి అవసరానికైనా ఖర్చు పెట్టవచ్చు. పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు, వ్యాపార ఖర్చులు సహా, పాత అప్పులను చెల్లించడానికి, ముఖ్యమైన కుటుంబ వేడుకలకు బంగారు రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అత్యవసర పరిస్థితుల్లో తక్కువ వడ్డీకి లభించే ఈ బంగారు రుణాలు మనల్ని ఆదుకుంటాయి. ఇతర రకాల రుణాలతో పోలిస్తే ఈ రుణం అర్హత, ప్రమాణాలు సరళంగా ఉంటాయి.

వడ్డీ రేటు, కాలవ్యవధి
ఏ ఇతర రుణాలతో పోల్చి చూసినా బంగారు రుణాలపై వడ్డీ తక్కువే ఉంటుంది. అయితే, ఈ రుణం తీసుకునేవారు వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ఆఫర్లను కచ్చితంగా పోల్చిచూసుకోవాలి. కొన్ని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు 8.80% నుంచి ఈ లోన్స్ అందజేస్తున్నాయి. తాకట్టు పెట్టే బంగారం పరిమాణాన్ని బట్టి బ్యాంకులు రూ.1500 నుంచి రూ.1.50 కోట్ల వరకు రుణంగా అందజేస్తున్నాయి. తిరిగి చెల్లించే కాలవ్యవధి 3 నెలల నుంచి 4 ఏళ్ల వరకు ఉంటుంది. వడ్డీ రేట్లు, మొత్తం రుణ ఆమోదం, ఈఎంఐల కాలవ్యవధి వివిధ బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి.

రుణం ఎంత శాతం?
ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కనుక బంగారం తాకట్టుపై ఎక్కువగానే రుణం లభిస్తోంది. మంజూరయ్యే రుణం, బంగారం స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. బంగారం స్వచ్ఛత తప్పనిసరిగా 18 నుంచి 24 క్యారెట్ల మధ్య ఉండాలి. ఆ ఆభరణాలకు విలువైన రాళ్లు ఉన్నా సరే వాటి బరువును లెక్కించరు. మీకు బ్యాంకులు ఇచ్చే లోన్​, బంగారం విలువపై 70% వరకు మాత్రమే ఉంటుంది. బ్యాంకులు, బంగారం ధరను బట్టి రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని సంస్థలు అదే రోజు ధరను పరిగణనలోకి తీసుకుంటే, మరికొన్ని సంస్థలు వారం లేదా పక్షం పాటు సగటు బంగారం ధరను పరిగణనలోకి తీసుకుంటాయి. దరఖాస్తుదారులు వ్యక్తిగత రుజువులుగా పాన్‌ కార్డ్​, ఆధార్‌ కార్డ్​లను అందించాల్సి ఉంటుంది.

లోన్ తీర్చడం ఎలా?
చాలా బ్యాంకులు ఇతర రుణాల మాదిరిగానే గోల్డ్ లోన్లకు కూడా ఈఎంఐల సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంటే, కొన్ని నెలలు అసలు, వడ్డీ కలిపి సమాన వాయిదాలుగా చెల్లించవచ్చు. ఉద్యోగులకు ఇది బాగానే ఉంటుంది. ప్రతి నెలా ఈఎంఐ చెల్లించలేనివారు (రైతులు, సీజనల్‌ వ్యాపారులు మొదలగువారు) మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి అసలు, వడ్డీ కలిపి చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా, కొన్ని బ్యాంకులు ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఇస్తున్నాయి. అంటే, బ్యాంకులు ఈ రుణాన్ని ఒక ప్రత్యేక ఖాతాలో వేస్తాయి. రుణగ్రహీత ఆ ఖాతా నుంచి వినియోగించిన మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించాలి. ఇటువంటి సౌకర్యం స్వయం ఉపాధి పొందుతున్నవారికి, ఉద్యోగులకు అనువుగా ఉంటుంది. బంగారు రుణాల ముందస్తు చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. కనుక రుణాన్ని గడువుకు ముందే ఎలాంటి అదనపు రుసుము లేకుండా చెల్లించవచ్చు. కొన్ని రుణ సంస్థలు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే, తాకట్టుగా అందించిన బంగారంలో కొంత భాగాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా అనుమతిస్తున్నాయి.

రుణం డిఫాల్టయితే?
అత్యవసర పరిస్థితుల్లో బంగారంపై రుణం త్వరగానే మంజూరవుతుంది. కానీ, చెల్లింపులపై డిఫాల్ట్‌ అయినప్పుడు బ్యాంకు నోటీస్​ ఇచ్చి ఆ తర్వాత బంగారాన్ని వేలం వేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రుణగ్రహీత బంగారంపై మంచి రేటును పొందే అవకాశం తక్కువ. కాబట్టి, ఇటువంటి సమయాల్లో బకాయిని చెల్లించడానికి కాస్త ఎక్కువ సమయం ఇచ్చే రుణ సంస్థను ఎంచుకోవడం మంచిది. రుణాన్ని రీ-షెడ్యూల్‌ చేయమని కూడా బ్యాంకును అభ్యర్థించవచ్చు.

తాకట్టు బంగారం సురక్షితమేనా?
మీకు రుణం కావలసినప్పుడు బ్యాంకు బంగారాన్ని హామీగా తీసుకుంటుంది. ఆ బంగారాన్ని కొన్ని నెలలు/ఏళ్లపాటు సురక్షితంగా భద్రపరచాల్సి ఉంటుంది. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు/ఆర్థిక సంస్థ సురక్షితమైన ప్రదేశం (స్ట్రాంగ్‌ రూం)లో భద్రపరుస్తుందా? లేదా? అని మీరు గమనించాలి. రుణ సంస్థలు దోపిడీ, అగ్నిప్రమాదం, విద్రోహ చర్యలు వంటి ఏదైనా దురదృష్టకర ఘటనలను నిరోధించడానికి తప్పనిసరిగా బీమాతో పాటు సురక్షితమైన వ్యవస్థలను కలిగి ఉండాలి. ముఖ్యంగా, రుణ సంస్థలు అధునాతన సీసీటీవీ నిఘా వ్యవస్థతో పాటు అత్యాధునిక డిజిటల్‌ వాయిస్‌/వీడియో రికార్డింగ్‌ సౌకర్యాలు కలిగి ఉండాలి. అందుచేత, మీరు తాకట్టు పెట్టిన బంగారం భద్రంగా ఉండడానికి ఆర్‌బీఐ నియంత్రణ, నియమాలను పాటించే బ్యాంకును లేదా ఆర్థిక సంస్థనే ఎంచుకోవాలి.

లోపాలు
బంగారు రుణాలిస్తున్న కొన్ని రుణ సంస్థలు అనేక అక్రమ పద్ధతులు అవలంభిస్తున్నట్లు ఇటీవలే ఆర్​బీఐ గుర్తించింది. కొన్ని సంస్థలు రుణాల జారీకి థర్డ్‌ పార్టీలను ఉపయోగించడంలో లోపాలున్నాయని, రుణం డిఫాల్టయినప్పుడు ఆభరణాల వేలం సమయంలో పారదర్శకత పాటించడం లేదని ఆర్​బీఐ తెలిపింది. ఇలాంటి విషయాల్లో ఆర్థిక సంస్థలు సక్రమంగా లేనప్పుడు రుణగ్రహీత తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్‌ కచ్చితంగా అనుసరిస్తున్న ఆర్థిక సంస్థలను మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం.

Gold Loan Vs Gold Sale : డబ్బు కోసం.. బంగారాన్ని అమ్మాలా? తాకట్టు పెట్టాలా?

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-3 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Gold Investment Tips For Women

ABOUT THE AUTHOR

...view details