తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏయే ఆదాయాలపై ఎంత TDS విధిస్తారో తెలుసా? ఇదిగో లిస్ట్! - TDS rates for various incomes 2024

TDS Rate Chart For 2024 : ఈ ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) మొదలుకానుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఏయే రకాల లావాదేవీలు, ఆదాయాలపై ఎంతమేర టీడీఎస్ విధిస్తారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Tax Deducted at Source guide
TDS Rate Chart for 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 11:30 AM IST

TDS Rate Chart For 2024 : మనకు వచ్చే గ్రాస్ సాలరీని మూలాదాయం అనొచ్చు. దానిపై విధించే పన్నును 'టీడీఎస్' (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) అంటారు. టీడీఎస్‌ను సాలరీతో పాటు ఇంటి అద్దె, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ, పీఎఫ్‌ ముందస్తు ఉపసంహరణ, బీమా కంపెనీ మెచ్యూరిటీ మొత్తం, లాటరీలో గెలిచిన అమౌంట్‌ల లాంటి లావాదేవీలపైనా విధిస్తారు. ఏయే రకాల లావాదేవీలు, ఆదాయాల నుంచి టీడీఎస్‌ను వసూలు చేస్తారనే సమాచారాన్ని ఆదాయపు పన్ను చట్టంలోని 30 సెక్షన్లలో ప్రస్తావించారు. ఐటీ సెక్షన్లు 192 నుంచి 206ఏఏ వరకు దీనికి సంబంధించిన నిబంధనలను పొందుపరిచారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) మొదలుకానుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఏయే రకాల లావాదేవీలు, ఆదాయాలపై ఎంతమేర టీడీఎస్ పన్నును విధిస్తారనే సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాలరీ
ప్రతినెలా మనకు కంపెనీ నుంచి వచ్చే సాలరీ అనేది ఆదాయపు పన్ను చట్టంలోని 192 సెక్షన్ పరిధిలోకి వస్తుంది. రూ.2.50 లక్షలలోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి టీడీఎస్ వర్తించదు. సీనియర్ సిటిజన్లు అయితే రూ.3 లక్షల వార్షిక వేతనం వరకు టీడీఎస్ విధించరు. వార్షిక వేతనం ఈ లిమిట్స్‌ను మించితే మాత్రం, దాన్ని అనుసరించి టీడీఎస్‌ను వసూలు చేస్తారు.

ఈపీఎఫ్
ఉద్యోగులు ఎప్పుడైనా అత్యవసరం వస్తే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుంచి అమౌంట్‌ను ముందస్తుగా విత్​డ్రా చేస్తుంటారు. అలా చేసే లావాదేవీ ఐటీ యాక్ట్‌లోని 192A సెక్షన్ పరిధిలోకి వస్తుంది. 50వేలలోపు విత్ డ్రా చేస్తే టీడీఎస్ లేదు. అంతకుమించి విత్​డ్రా చేసే క్రమంలో పాన్ కార్డును సబ్మిట్ చేస్తే 10 శాతం టీడీఎస్, పాన్ కార్డును సబ్మిట్ చేయకుంటే 20 శాతం టీడీఎస్ విధిస్తారు.

సెక్యూరిటీలపై వడ్డీ
బాండ్లు, షేర్ల లాంటి సెక్యూరిటీలపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.5వేలను మించితే 10 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 193 పరిధిలోకి వస్తుంది.

డివిడెండ్
వివిధ రకాల మార్గాల్లో లభించే డివిడెండ్ ఆదాయం రూ.5వేలను మించితే 10 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194 పరిధిలోకి వస్తుంది.

బ్యాంకు లేదా పోస్టాఫీసు డిపాజిట్లపై వడ్డీ
మనం బ్యాంకులు, పోస్టాఫీసులో డిపాజిట్లు చేస్తుంటాం. వాటిపై వచ్చే వడ్డీ ఆదాయంపైనా టీడీఎస్ విధిస్తారు. అయితే సాధారణ వ్యక్తులకు ఈ వడ్డీ ఆదాయం రూ.40వేలు దాటితే 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ ఆదాయం రూ.50వేలు దాటితే 10 శాతం టీడీఎస్‌ను వసూలు చేస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194A పరిధిలోకి వస్తుంది.

లాటరీల ఆదాయం
చాలా మంది లాటరీలు తీసుకుంటుంటారు. పజిల్స్, కార్డ్ గేమ్స్ ఆడి ఆదాయాన్ని గడిస్తుంటారు. ఇలాంటి వ్యవహారాలు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194B పరిధిలోకి వస్తాయి. ఈతరహా ఆదాయం రూ.10వేలు దాటితే 30 శాతం టీడీఎస్ విధిస్తారు.

ఆన్‌లైన్ గేమ్స్ ఆదాయం
ఈ మధ్య కాలంలో క్రికెట్, రమ్మీ లాంటి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడే వారి సంఖ్య పెరిగింది. ఈ గేమ్స్ ద్వారా వచ్చే ప్రతీ పైసాపై 30 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194BA పరిధిలోకి వస్తుంది.

గుర్రపు పందేల ఆదాయం
అత్యంత ధనవంతులు గుర్రపు పందేల్లోనూ పాల్గొంటుంటారు. ఆ పందేల్లో గెలిచే వారికి భారీ ఆదాయం వస్తుంటుంది. అలాంటి ఆదాయం రూ.10వేలను మించి 30 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194BB పరిధిలోకి వస్తుంది.

బీమా పాలసీలపై కమీషన్ ఆదాయం
చాలామంది బీమా ఏజెంట్లు ఉంటారు. వాళ్లు ఎన్నో ఇన్సూరెన్స్ పాలసీలు చేయిస్తుంటారు. ఇలా పాలసీలు చేయించడం ద్వారా వారు సంపాదించే కమీషన్ ఆదాయం రూ.15వేలు దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. బీమా ఏజెంట్లపై 5 శాతం, బీమా కంపెనీలపై 10 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194D పరిధిలోకి వస్తుంది.

జీవిత బీమా పాలసీలు
జీవిత బీమా పాలసీకి మనం చేసే చెల్లింపులు సంవత్సరానికి రూ.1 లక్ష దాటితే 5 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194DA పరిధిలోకి వస్తుంది.

జాతీయ పొదుపు పథకం పేమెంట్స్
మనలో చాలా మంది జాతీయ పొదుపు పథకంలో డబ్బులు పొదుపు చేస్తుంటారు. దీని కోసం మనం చేసే చెల్లింపులు రూ.2,500 దాటితే 10 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194EE పరిధిలోకి వస్తుంది.

మ్యూచువల్ ఫండ్ పేమెంట్స్
మ్యూచువల్ ఫండ్ లేదా యూటీఐ ద్వారా యూనిట్లను కొనేందుకు చేసే పేమెంట్స్‌పై 20 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194F పరిధిలోకి వస్తుంది.

కమీషన్/బ్రోకరేజ్
పలు రకాల ఆర్థిక సేవలను అందించినందుకు వ్యక్తులు/సంస్థలు - కమీషన్/బ్రోకరేజీలను వసూలు చేస్తుంటాయి. ఈ కమీషన్/బ్రోకరేజీ మొత్తం రూ.15వేలు దాటితే 5 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194H పరిధిలోకి వస్తుంది.

అద్దెలు
ప్లాంట్, యంత్రాలను అద్దెకు ఇచ్చి కొంతమంది ఆదాయం పొందుతుంటారు. వీటి ద్వారా వచ్చే అద్దె ఆదాయం రూ.2.40 లక్షలు దాటితే 2 శాతం టీడీఎస్ విధిస్తారు. భూమి/భవనం/ఫర్నీచర్/ఫిట్టింగ్‌లను కొంతమంది అద్దెకు ఇస్తుంటారు. వాటి ద్వారా వచ్చే అద్దె ఆదాయం రూ.2.40 లక్షలు దాటితే 10 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారాలు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194-I పరిధిలోకి వస్తాయి.

వ్యవసాయ భూమి మినహా ఇతర స్థిరాస్తుల బదిలీ
వ్యవసాయ భూమి మినహా ఇతర స్థిరాస్తుల యాజమాన్య హక్కులను ఎవరికైనా బదిలీ చేసేటప్పుడు పేమెంట్స్ చేస్తుంటారు. ఇలాంటి చెల్లింపులు రూ.50 లక్షలు దాటితే 1 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194-IA పరిధిలోకి వస్తుంది.

హిందూ అవిభాజ్య కుటుంబం అద్దెలు
హిందూ అవిభాజ్య కుటుంబం/వ్యక్తి చెల్లించిన అద్దె మొత్తం రూ.50వేలు దాటితే 5 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194-IB పరిధిలోకి వస్తుంది.

స్థిరాస్తి కొనుగోలు పరిహారం
స్థిరాస్తిని కొన్నందుకు మనం చెల్లించే అమౌంట్ రూ.2.50 లక్షలు దాటితే 10 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194LA పరిధిలోకి వస్తుంది.

నగదు విత్‌డ్రా పరిమితిని మించితే?
నిర్దిష్ట మొత్తానికి మించి నగదును మనం బ్యాంకులు, ఏటీఎంలు, క్రెడిట్ కార్డుల నుంచి విత్‌డ్రా చేస్తే టీడీఎస్ విధిస్తారు. సహకార సంఘాల నుంచి విత్‌డ్రా చేసే అమౌంట్ రూ.3 కోట్లు దాటితే 2 శాతం టీడీఎస్ విధిస్తారు. వివిధ బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.1 కోటికి మించి నగదు విత్ డ్రా చేసినా 2 శాతం టీడీఎస్ విధిస్తారు.

రూ.20 లక్షలకు మించి నగదు విత్ డ్రా చేస్తే 2 శాతం, రూ.1 కోటి కంటే ఎక్కువ క్యాష్ విత్ డ్రా చేస్తే 5 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారాలు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194N పరిధిలోకి వస్తాయి.

సీనియర్ సిటిజన్ల వడ్డీ ఆదాయం
సీనియర్ సిటిజన్లకు వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం రూ.50వేలు దాటితే, ఆ పై ఎంత ఆదాయం వస్తుందో దానిపై టీడీఎస్ విధిస్తారు. ఆదాయాన్ని బట్టి టీడీఎస్ రేటును డిసైడ్ చేస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194P పరిధిలోకి వస్తుంది.

వర్చువల్ డిజిటల్ ఆస్తుల చెల్లింపు
కొంతమంది వర్చువల్‌గా గోల్డ్, సిల్వర్ లాంటివి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎంపిక చేసిన వ్యక్తులు జరిపే ఇలాంటి లావాదేవీల మొత్తం విలువ రూ.50వేలు దాటితే 1 శాతం టీడీఎస్ విధిస్తారు. సాధారణ వ్యక్తులు జరిపే ఈ తరహా లావాదేవీ మొత్తం రూ.10వేలు దాటితే 1 శాతం టీడీఎస్ వసూలు చేస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 194S పరిధిలోకి వస్తుంది.

ఎన్నారైల పెట్టుబడులపై ఆదాయం
చాలామంది ఎన్నారైలు విదేశాల్లో సంపాదిస్తూనే, రకరకాల వనరుల ద్వారా మనం దేశంలోనూ ఆదాయం గడిస్తుంటారు. అలాంటి వారు సంపాదించే ఆదాయంపై 20 శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ వ్యవహారం ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 195 పరిధిలోకి వస్తుంది.

ఇంట్లోనే డబ్బులు దాచుకుంటున్నారా? ఐటీ దాడులు జరిగితే పరిస్థితి ఏమిటో ఊహించారా?

మీకు ఇంటి మీద ఆదాయం వస్తోందా? కచ్చితంగా ఈ 'ట్యాక్స్'​ వివరాలు తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details