Tax Saving Investments :మన భవిష్యత్ బాగుండాలంటే, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే, అందుకు తగిన ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం మంచి పన్ను ఆదా పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు, నష్టాన్ని భరించే శక్తిని అనుగుణంగా, ఈ పథకాలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మీ భవిష్యత్‌కు భరోసా లభిస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న నేపథ్యంలో, పన్ను ప్రణాళికలు వేసుకునేవారు, కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ఆదాయ పన్ను భారం తగ్గేలా, నిర్ణీత మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చట్టం అనుమతి ఇస్తోంది. కనుక కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చినవారు దీర్ఘకాలిక దృష్టితో పథకాలను ఎంచుకోవాలి. ఇప్పటికే పన్ను చెల్లిస్తున్నవారు, తమ పెట్టుబడులను ఒకసారి సమీక్షించుకోవాలి.
వ్యూహాత్మకంగా
పెట్టుబడులు పెట్టే ముందు కచ్చితంగా కట్టాల్సిన పన్నులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కొత్త పన్ను విధానం ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7.5 లక్షలలోపు సంపాదించేవారు, ఎలాంటి పన్ను కట్టాల్సిన పనిలేదు. కనుక ఈ పరిమితిలోపు ఉన్నవారు, పన్ను గురించి, పెట్టుబడుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ భవిష్యత్త్ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మకంగా, గరిష్ఠ ప్రయోజనాలు పొందేలా పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఇందుకోసం ముందుగా పాత పన్ను విధానంలో, ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో తెలుసుకోవాలి. అవసరమైతే ఆదాయ పన్ను వెబ్సైట్లో ఉన్న ఆన్లైన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకోవాలి. అలాగే కొత్త పన్నుల విధానాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోవాలి. ఏ విధానంలో తక్కువ పన్ను ఉందో, స్పష్టమైన అవగాహనకు వచ్చి, దాని ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలి.
మినహాయింపులు
ఇంటి అద్దె, పిల్లల ట్యూషన్ ఫీజులు, గృహరుణం - అసలు, వడ్డీలు, పీఎఫ్ జమ, బీమా పాలసీలు అన్నింటినీ చూసుకోవాలి. ఇవన్నీ పన్ను భారం తగ్గించుకునేందుకు ఉపకరిస్తాయి. ఇవి కాకుండా ఇంకా వేటిపై పన్నులు చెల్లించాలి. పన్ను మినహాయింపులు లభించే పెట్టుబడులు ఏమున్నాయో చూసుకోవాలి. అప్పుడే వీలైనంత వరకు పన్నుల భారం తగ్గించుకోవచ్చు.