Sundar Pichai To Be Billionaire : గూగుల్ పేరెంట్ కంపెనీ ఇద్దరు వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌ల పేర్లు ప్రపంచంలోని టాప్-10 ధనవంతుల జాబితాలో ఉన్నాయి! అలాంటి అపర కుబేరుల నమ్మకాన్ని చూరగొన్న సుందర్ పిచాయ్ కూడా ఇప్పుడు బిలియనీర్ కాబోతున్నారు. అంటే ఆయన నికర సంపద విలువ 100 కోట్ల డాలర్లకు చేరువైంది. 'బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్' ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆ ఘనత సుందర్‌దే!
సాధారణంగా కంపెనీల వ్యవస్థాపకుల సంపదే ఇంతటి స్థాయికి చేరుతుంటుంది. కానీ సాధారణ ఉద్యోగిలా ప్రొడక్ట్ మేనేజర్ హోదాలో గూగుల్‌లో చేరిన సుందర్ పిచాయ్ అసాధారణంగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. తనకు గూగుల్ కంపెనీ అప్పగించిన టాస్క్‌లను విజయవతంగా పూర్తి చేశారు. తొలుత గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్‌ను డెవలప్ చేసి నెటిజన్లకు చేరువ చేసిన ఘనత సుందర్‌కే దక్కుతుంది. ఈ విషయాన్ని గూగుల్ యజమానులు కూడా అంగీకరించారు.
అందుకే సుందర్ పిచాయ్‌కు సీఈఓ హోదాను కట్టబెట్టారు. 2015లో గూగుల్‌లో ఈ హోదాను పొందిన సుందర్, గత తొమ్మిదేళ్లలో వేతనం, ఇతర భత్యాలు, ప్రోత్సాహకాల రూపంలో బాగానే సంపాదించారు. ఆయనకు కేటాయించిన 'ఆల్ఫాబెట్ కంపెనీ' షేర్ల ధరలు కూడా గత తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో బాగా పెరిగాయి. ఆ స్థాయిలో గూగుల్ మార్కెట్ విలువను పెంచేలా వ్యాపార ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చి, వాటిని ప్రజలకు చేరువ చేశారు సుందర్.