Stock Market Close : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 1.5 శాతం వరకు నష్టపోయాయి. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతుండడం సహా, జపాన్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాంటి ఫ్రంట్‌లైన్ స్టాక్స్ హెవీ సెల్లింగ్ జరగడం కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది.
రికార్డ్ ర్యాలీ తరువాత మదుపరులు లాభాలు స్వీకరించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించడం కూడా దేశీయ మార్కెట్లను దెబ్బకొట్టింది. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1272 పాయింట్లు నష్టపోయి 84,299 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 368 పాయింట్లు కోల్పోయి 25,810 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, ఏసియన్ పెయింట్స్
- నష్టపోయిన షేర్లు :యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్‌సెర్వ్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్
ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యోలు భారీగా నష్టపోగా, షాంఘై, హాంకాంగ్ లాభాలతో గట్టెక్కాయి. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ సంస్థాగత పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1209.10 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.
ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.19 శాతం మేర తగ్గిపోయాయి. దీని ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 71.84 డాలర్లుగా ఉంది.