- రోజంతా మౌనం
- 10 కప్పుల టీతోనే జీవనం
- IAS ఆశావహులకు ఉచిత శిక్షణ
- వాట్సాప్ ద్వారా నోట్స్
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఛాయ్ వాలే బాబా దినచర్య ఇది. గత 40 ఏళ్లుగా రోజుకు పది కప్పుల టీ మాత్రమే తాగుతూ ఆయన జీవిస్తున్నారు. ఏం తినకుండా, ఏం మాట్లాడకుండా సివిల్ సర్వీసెస్ ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. ఇప్పుడు మహాకుంభమేళాకు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. పలువురు పేపర్‌పై రాసిన ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాతపూర్వకంగా ఇస్తున్నారు.
Chai Wale Baba IAS Coaching : ప్రతాప్ గఢ్‌కు చెందిన దినేశ్ స్వరూప్ బ్రహ్మచారి తొలుత టీ అమ్మేవారు. ఆ తర్వాత సన్యాసిగా మారారు. అక్కడి కొద్ది రోజుల తర్వాత ఆహారాన్ని తినడం మానేశారు. అప్పటి నుంచి టీతోనే జీవిస్తున్నారు. మౌనంగా ఉంటూ వాట్సాప్ ద్వారా ఎంతో మంది సివిల్ సర్వీసెస్ ఉద్యోగార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. పలువురు శిష్యులు ఉద్యోగం సంపాదించి అధికారులుగా మారేలా శిక్షణ అందించారు. ఇప్పటికీ అందిస్తున్నారు కూడా.
ఛాయ్ వాలే బాబాతో తనకు ఐదేళ్లకుపైగా అనుబంధం ఉందని సివిల్ సర్వీస్ ఆశావహుడైన రాజేశ్ సింగ్ తెలిపారు. తాను ఆయన శిష్యుడినని, అవసరమైన ప్రతిసారి తమకు ఆయన మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. గురూజీ ఎప్పుడూ మౌనంగా ఉంటారని, తాము ఆయన హావభావాలు, వాట్సాప్ సందేశాల ద్వారా అర్థం చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రశ్నలు రాసి ఇస్తే, రాతపూర్వంగా సమాధానాలు ఇస్తారని వెల్లడించారు.
ఛాయ్ వాలే బాబా లక్ష్యం ఇదే!
"సివిల్ సర్వీస్ ఆశావహులకు బాబా వాట్సాప్ ద్వారా స్టడీ నోట్స్ అందిస్తారు. ఆయన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా తన సమాధానాలతో ప్రశ్నలను పరిష్కరిస్తారు. ఓసారి అడిగితే- విద్యార్థులకు విద్యను అందించడం, వారు అధికారులుగా మారేందుకు సహాయం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. మౌనంగా ఉండి శక్తిని కూడబెట్టుకుంటానని, దానిని ప్రపంచ సంక్షేమం కోసం ఉపయోగిస్తానని బాబా తెలిపారు" అంటూ రాజేశ్ సింగ్ వివరించారు.
కుంభమేళాలో ఆకర్షణగా ఎందరో సాధువులు
అయితే ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా వేళ ఎందరో సాధువులు విచిత్ర వేషధారణల్లో కనిపిస్తున్నారు. గ్రెయిన్ బాబా, రుద్రాక్ష బాబా, అంబాసిడర్ బాబాగా ప్రసిద్ధిగాంచిన సాధువులు సందర్శకులను ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు ఛాయ్ వాలే బాబా కూడా యాత్రికులను ఆకట్టుకుంటున్నారు.