AP CM Chandrababu Visits Tirupati Stampede Incident Place : తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి అధికారులతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
భక్తుల రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారు? : ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనే విషయంపై సమాధానం చెప్పాలన్నారు. ‘భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు?" అని ప్రశ్నించారు. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలని, తమాషా అనుకోవద్దని చంద్రబాబు హెచ్చరించారు.
'భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలనే విషయం తెలియదా? భక్తుల నుంచి కంప్లైంట్లు వచ్చాక ఏం చేశారు?' అని టీటీడీ జేఈవో గౌతమిని సీఎం ప్రశ్నించారు. జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం అంబులెన్స్‌ల లభ్యత గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సీఎం వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే : శ్రీవారి వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్ల జారీ కేంద్రాలకు పెద్దఎత్తున భక్తులు తరలి రావడంతో బుధవారం రాత్రి తిరుపతిలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది భక్తులకు అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను స్విమ్స్, రుయా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతిలో తొక్కిసలాట - ఆరుగురు భక్తుల మృతి
విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా? - అధికారులపై చంద్రబాబు మండిపాటు