Stock Market Close :దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఆరో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఐటీ స్టాక్స్ అండతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు, తరువాత తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరికి ఎఫ్‌ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో పతనమయ్యాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడే సెన్సెక్స్ 900 పాయింట్ల మేర పతనం కాగా, నిఫ్టీ 24,800 స్థాయికి పతనం అయ్యింది. అదానీ పోర్ట్స్, బెల్, ఎన్‌టీపీసీ షేర్లు భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుండడం, విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండడమే ఇందుకు కారణం. ఈ వారంలో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెలువడనున్నాయి. దీనితో మదుపర్లు కాస్త అప్రమత్తంగా ఉన్నారు. ఇది స్టాక్ మార్కెట్లను కోలుకోకుండా చేసింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 638 పాయింట్లు నష్టపోయి 81,050 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,795 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా
- నష్టపోయిన షేర్లు : అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్
ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్, సియోల్ అన్నీ లాభాలతో ముగిశాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు మిక్స్‌డ్ ట్రెండ్‌లో నడుస్తున్నాయి.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.9,896.95 కోట్ల విలువై ఈక్విటీ షేర్లను అమ్మేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.8,905.08 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.09 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 79.68 డాలర్లుగా ఉంది.