పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సహా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు అమాంతం పెరిగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో గురువారం ముగిశాయి. సెన్సెక్స్ 1,769 పాయింట్లు నష్టపోయి 82,497 వద్ద, నిఫ్టీ 547 పాయింట్లు కోల్పోయి 25,250 వద్ద స్థిరపడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే మదుపర్లు దాదాపు రూ.11 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే సూచీలు భారీ నష్టాలు నమోదు చేశాయి. ఉదయం 83,002 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా పడిపోతూనే ఉంది. ఇంట్రాడేలో 82,434.02 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 1769.19 పాయింట్ల నష్టంతో 82,497.10 వద్ద ముగిసింది. నిఫ్టీ 546.80 పాయింట్ల నష్టంతో 25,250.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.97 వద్ద ముగిసింది.