దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బలహీన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్చితి వంటి కారణాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 23 వేల పాయింట్ల దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఓ దశలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 3 శాతం, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ 4 శాతం చొప్పున కుంగాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరై రూ.410 లక్షల కోట్లకు చేరింది.
కారణాలు ఇవే..
- అమెరికాలోని అక్రమ వలసదారులకు తిప్పి పంపే విషయంలో తొలుత కొలంబియా వ్యతిరేకించడం, దానికి ప్రతిగా 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ బెదిరించడం, దాంతో కొలంబియా తన నిర్ణయాన్ని మార్చుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. దేశాలను దారికి తెచ్చుకునే విషయంలో ట్రంప్ ఇలా బెదిరింపులకు దిగుతుండడంతో ఎప్పుడు ఏ దేశంపై ఉరుముతారోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇలాంటి హెచ్చరికలు కెనడా, మెక్సికోకు ఆయన జారీ చేసిన విషయం తెలిసిందే.
- త్రైమాసిక ఫలితాల సీజన్‌లో వెలువడుతున్న కార్పొరేట్ ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో మదుపర్లు నిరాశగా ఉన్నారు. దీనికి తోడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కూడా మదుపర్లకు పెద్దగా ఆశల్లేకపోవడం మార్కెట్లలో నిరాసక్తతకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ సారి ఎలాంటి కోతా ఉండకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే, మున్ముందు ఎలా వ్యవహరిస్తారనే విషయంలో ఫెడ్ నుంచి ఎలాంటి కామెంట్లు వెలువడతాయనే దానిపై మార్కెట్లు చలించే అవకాశం ఉందని అనలిస్టులు చెబుతున్నారు.
- దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్ నాటికి (జనవరి 24) సుమారు రూ.64 వేల కోట్ల ఈక్విటీలను వారు విక్రయించడం గమనార్హం. సమీప భవిష్యత్‌లో ఈ మొత్తాలు తగ్గుతాయని గానీ, మళ్లీ కొనుగోళ్లకు దిగుతారన్న అంచనాలు గానీ లేకపోవడం మార్కెట్లో ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.