Steps To Take When The Credit Card Is Lost Or Stolen :ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడడం సర్వసాధారణం అయిపోయింది. చేతిలో డబ్బులు లేనప్పుడు మనల్ని అవసరాల నుంచి గట్టేక్కించేవి ఈ కార్డులే. అయితే అనుకోకుండా ఎప్పుడైనా మీ క్రెడిట్ కార్డు పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా దానిని వెంటనే బ్లాక్ చేయాలి. లేదంటే చాలా ప్రమాదం. ఎందుకంటే, మోసగాళ్లు మీ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేయవచ్చు. లేదా మీ క్రెడిట్ కార్డుతో అనధికార కార్యకలాపాలకు పాల్పడవచ్చు. అందుకే క్రెడిట్ కార్డు పోయినప్పుడు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తీసుకోవాల్సిన చర్యలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్ చేయాలి
మీ క్రెడిట్ కార్డు పోయినా, ఎవరైనా దొంగిలించినా లేదా అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించినా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని కార్డును బ్లాక్ చేయడం. మీ క్రెడిట్ కార్డు పోగానే వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. లేదా బ్యాంక్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డును మీరే బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా క్రెడిట్ కార్డును బ్లాక్ చేయడం వల్ల, ఆపై ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకుండా మోసగాళ్లను నియంత్రించవచ్చు.
2. FIR ఫైల్ చేయాలి
మీ క్రెడిట్ కార్డు పోయిందని బ్యాంకుకు తెలియజేసిన తర్వాత, వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యేట్లు చూడాలి. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డుతో మోసగాళ్లు చేసిన అనధికార ఆర్థిక లావాదేవీలకు, కార్యకలాపాలకు మీరు బాధ్యత వహించే బాధ తప్పుతుంది. అలాగే ఈ ఎఫ్‌ఐఆర్ మీ క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ కోసం చట్టపరమైన రుజువుగా ఉపయోగపడుతుంది.
3. క్రెడిట్ బ్యూరోని సంప్రదించాలి
క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్న విషయాన్ని క్రెడిట్ కార్డ్ బ్యూరోలకు కచ్చితంగా తెలియజేయాలి. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది. అలాగే మీ క్రెడిట్ నివేదికను బాగా పరిశీలించి, ఏవైనా వ్యత్యాసాలు గమనిస్తే, వాటిని క్రెడిట్ బ్యూరోకు నివేదించాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉంటుంది.
4. లావాదేవీలను గమనించాలి
దొంగతనానికి గురైనక్రెడిట్ కార్డుతో జరిగిన లావాదేవీలు, స్టేట్మెంట్లను మీరు నిరంతరం గమనిస్తుండాలి. మీ క్రెడిట్ కార్డుతో అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గమనిస్తే, వెంటనే బ్యాంకుకు సమాచారం అందివ్వాలి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, మీ క్రెడిట్ కార్డుతో మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. ఆలస్యంగా సమాచారం అందిస్తే బ్యాంకు/కస్టమర్‌కు నష్టం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వినియోగదారులు సంబంధిత బ్యాంకుకు వీలైనంత త్వరగా సమాచారం అందించాలి.