Smart SIP Tips :నేడు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ఇవి నేరుగా స్టాక్ మార్కెట్‌తో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి రిస్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ నష్టభయాన్ని తగ్గించుకునేందుకు మంచి పెట్టుబడి వ్యూహాలను పాటించాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడో ఒకసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కన్నా, క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
నిధిని సృష్టించండి : అత్యవసర పరిస్థితుల్లోనూ దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి డబ్బును తీయకుండా ఉండాలి. ఇందుకోసం కనీసం 6 నెలల ఖర్చులకు సరిపోయే డబ్బు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం మీరు లిక్విడ్ ఫండ్లలో సిప్ చేయవచ్చు.
మధ్యస్థ కాలానికి :యువ పెట్టుబడిదారులకు కొన్ని మధ్యస్థ కాల లక్ష్యాలు ఉంటాయి. ఇలాంటి అవసరాల కోసం విడిగా ఇన్వెస్ట్ చేస్తుండాలి. ఉదాహరణకు మీరు కారు కొనాలని ఆశపడవచ్చు. లేదా ఇంటి కోసం ముందస్తు చెల్లింపు చేయాలని అనుకోవచ్చు. ఇలాంటి వాటన్నింటికీ ప్రత్యేకంగా ఒక సిప్‌ను ప్రారంభించాలి. స్వల్పకాలిక డెట్ ఫండ్లను కూడా ఇందు కోసం ఎంపిక చేసుకోవచ్చు.
దీర్ఘకాలిక లక్ష్యం : మీరు సాధించాల్సిన లక్ష్యం 15-20 ఏళ్లు లేదా అంతకు మించి ఉంటే, దీర్ఘకాలిక వ్యూహంతో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పిల్లల ఉన్నత చదువులు, మీ పదవీ విరమణ లాంటివి ఇందుకు ఉదాహరణ. ఇందు కోసం నష్టభయాన్ని భరించే సామర్థ్యం ఆధారంగా 80-90 శాతం వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి.
కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించే వారు సెన్సెక్స్, నిఫ్టీ సూచీల ఆధారంగా పనిచేసే లార్జ్ క్యాప్ ఫండ్లను పరిశీలించాలి. ఈక్విటీలు అంటేనే అస్థిరతకు మారుపేరు. కనుక మార్కెట్ ఒడుదొడుకులకు మీరు మానసికంగా సిద్ధపడాలి. ఇందుకోసం కనీసం రెండు మూడేళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాతే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ వంటి వాటికి కొంచెం ఎక్కువ మొత్తంలో పెట్టుబడిని కేటాయించాలి.