SBI Digital MSME Loan In 45 Minutes :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిజిటల్ బిజినెస్ లోన్స్ ప్రారంభించింది. దీని ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME)కు కేవలం 45 నిమిషాల్లోనే లోన్ మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. రానున్న 5 ఏళ్లలో ఈ ఎంఎస్ఎంఈ విభాగం బాగా అభివృద్ధి చెందుతుందని, కనుక లాభాలు కూడా భారీ స్థాయిలో వస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఈ)లకు ఏకంగా రూ.4.33 లక్షల కోట్ల వరకు రుణాలు మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన మొత్తంతో పోల్చితే ఇది దాదాపు 20 శాతం అధికం కావడం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఎంఎస్ఈ విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు 2019-20లో 9.43 శాతం ఉండగా, అవి 2023-24 నాటికి 3.75 శాతానికి తగ్గాయని ఎస్‌బీఐ వెల్లడించింది.
వేగంగా రుణాలు మంజూరు!
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అధికంగా రుణాలు ఇచ్చి, ఈ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటామి ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు సంబంధించిన సమాచారం తమ దగ్గర ఉందని, దానిని విశ్లేషించి రుణ ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా ప్రారంభించిన ఈ డిజిటల్ బిజినెస్ లోన్స్ విధానం వల్ల సంప్రదాయంగా వస్తున్న క్రెడిట్ అండర్ రైటింగ్, సుదీర్ఘమైన పరిశీలన మొదలైన సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల లోన్ ప్రక్రియ చాలా సరళతరం అవుతుంది. ఫలితంగా చిన్న పరిశ్రమలకు వేగంగా లోన్స్ మంజూరు చేయడానికి వీలవుతుంది.
కేవలం 10 సెకెన్లలోనే లోన్!
డేటా ఆధారిత రుణ మంజూరు సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది. దీని ద్వారా కేవలం 10 సెకెన్లలోపే రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్నులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు మొదలైనవాటితో పాటు, అవసరమైన వివరాలను సమర్పిస్తే చాలు. కేవలం 10 సెకన్లలోపే రుణం మంజూరు చేయాలా? వద్దా? అనేది సిస్టమ్ నిర్ణయిస్తుంది. ఈ విధంగా వేగంగా లోన్ మంజూరు చేయడానికి వీలవుతుంది.